క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 17,2024 20:04

వైసిపి, టిడిపి అభ్యర్థుల్లో ఆందోళన 

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఎన్నికల ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. గెలుపోటములపై సమీక్షలు దాదాపు ముగిశాయి. ఎవరి ధీమాల్లో వారు ఉన్నారు. కానీ, తాజాగా వైసిపి, టిడిపి నాయకులు అభ్యర్థులు, నాయకుల్లో క్రాస్‌ ఓటింగ్‌ గుబులు మొదలైంది. విజయనగరంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇటువంటి చర్చే నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అభ్యర్థులను బట్టి, స్థానిక నాయకత్వంపై ఉన్న వ్యతిరేకత తదితర అంశాల ఆధారంగా ఎంపీ ఓటు ఒకపార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరోపార్టీకి వేశారనే చర్చనడుస్తోంది. డబ్బు ప్రభావం ఉన్నచోట ఇంట్లో ఇద్దరు ఉంటే వారు అభిమానించే పార్టీకి ఒకరు, అధికంగా డబ్బులు ఇచ్చిన పార్టీకి మరొకరు వేసినట్టు చర్చ వినిపిస్తోంది. ఎస్‌.కోట టిడిపిలో నామినేషన్‌ దశవరకూ రెండు గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక గ్రూపు ఎంపీ ఓటు విశాఖ టిడిపి అభ్యర్థి భరత్‌కు వేసినప్పటికీ, ఎమ్మెల్యేకు ఓటు వేయలేదని చర్చనడుస్తోంది. వేపాడ మండలంలో ఎక్కువగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అదే నియోకజవర్గంలో మిగిలిన చోట్ల టిడిపిలోని మరో గ్రూపు ఎమ్మెల్యే ఓటు టిడిపి అభ్యర్థికి వేసినప్పటికీ ఒకరిద్దని నేతల కనుసన్నల్లో వైసిపి అభ్యర్థికి వేసినట్టుగా చర్చనడుస్తోంది. బొత్సపై ఆకర్షణతోనూ కొన్ని ఓట్లు విశాఖ వైసిపి ఎంపీ అభ్యర్థి ఝన్సీలక్ష్మికి వెళ్లిపోయాయని కూడా ఆ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. విజయనగరంలోని కొన్ని మురికివాడల్లో ఇరు పార్టీల అభ్యర్థుల తరపునా డబ్బులు బలవంతంగా అంటగట్టడంతో అభిమాన పార్టీకి ఒక ఓటు, ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికి మరో ఓటు వేశారని చర్చమొదలైంది. ఈ విషయంలో ఎక్కువగా టిడిపియే లాభపడే అవకాశం ఉంది. గజపతినగరంలో టిడిపి అభ్యర్థికి వైసిపి ఓట్లు కూడా పడ్డాయట. ఇక్కడ కొంతమంది కొత్త ఎంపీ అభ్యర్థిని కోరుకోగా, మరికొందరు ఎమ్మెల్యే ఓటుతోపాటు ఎంపీ ఓటు కూడా ఒకటో నెంబరుకే గుద్దేశారని సమాచారం. స్థానిక నాయకుడనే అభిమానంతో చీపురుపల్లి పట్టణంలో టిడిపి ఓటర్లలో కొంతవరకు వైసిపి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు ఓట్లు వేసినట్టు చర్చ ఉంది. అయితే, ఇంతకు మించిన స్థాయిలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైసిపి అభిమానులు టిడిపి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు ఓటు వేసినట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కలిశెట్టి తొలి నుంచీ అదే నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఆశిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో స్థానికుడనే అభిమానంతో వైసిపి అభిమానులు కూడా అధిక సంఖ్యలో సహకరించారనే చర్చ నడుస్తోంది. అరకు పార్లమెంట్‌ పరిధిలోని మెంటాడ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం లేదు. ఈనేపథ్యంలో బిజెపి వ్యతిరేకులతోపాటు టిడిపి అభిమానులు కూడా సిపిఎం అభ్యర్థి అప్పలనర్సకు సహకరించారనే వాదన ఉంది. అటు పాలకొండ, భామిని, సీతంపేటలో కూడా ఈపరిస్థితే కనిపిస్తోంది. కురుపాంలో చాలా చోట్ల డబ్బు ప్రభావం కనిపించింది. అభిమాన పార్టీకి, డబ్బులు ఇచ్చిన పార్టీకి చెరుసగం వేశారని చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎవరికి వస్తాయనుకున్న ఓట్లు ఎవరికి క్రాస్‌ అయ్యోయో అనే ఉత్కంఠతో అభ్యర్థులు ఉన్నారు.

➡️