‘దాచూరి’ సేవలు మరువలేనివి

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: ఉపాధ్యాయ ఉద్యమ నేత దివంగత దాచూరి రామిరెడ్డి సేవలు మరువలేనివని యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు మొద్దు నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పెద్దదోర్నాలలోని యుటిఎఫ్‌ కార్యాల యంలో దాచూరి రామిరెడ్డి 8వ వర్థంతి సభ ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన అవకాశవాద ధోరణులను ఎదిరించి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాలతో ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అప్పారి వెంకటస్వామి, నాదెళ్ల సీతారామాచారి, సూర్యనారాయణరాజు లాంటి నేతలతో కలిసి 1974 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. యుటిఫ్‌ ఆవిర్భావం నుంచి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారని గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షునిగా 1981 నుంచి 2000 మధ్య సేవలందించారన్నారు. సమరశీల పోరాటాలు నడవడమే కాకుండా, ఒక్క రోజు సమ్మెతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును ఒప్పించి రీ గ్రూపింగ్‌ స్కేల్స్‌పై ఆధారపడిన ఆటోమాటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ తేవటంలో ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణంతో పాటు సమయస్ఫూర్తి కనిపిస్తుందని అన్నారు. నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలిసిన జీవనశైలి ఆయనదన్నారు. 16 ఏళ్ల ఉద్యోగ సర్వీసును వదలి యుటిఫ్‌లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారని అన్నారు. 1982లో యుటిఫ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా గెలుపొందారన్నారు. 2007లో మరలా ఎంఎల్‌సిగా విజయం సాధించారన్నారు. 1981-84 మధ్య ఉపాధ్యాయులు సాధించుకున్న రీగ్రూపింగ్‌ స్కేళ్లు, ప్రధానోపాధ్యాయులను స్కేల్స్‌, బిఇడి అర్హత లేకుండా ఎస్‌జిటి ఉపాధ్యాయులకు టైం స్కేల్‌ భాషా పండితుల 1983 అప్‌ గ్రేడేషన్‌, ఎయిడెడ్‌ టీచర్లకు డైరెక్ట్‌ పేమెంట్‌, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ రక్షణ, రిటైర్మెంట్‌ సౌకర్యాల వంటివన్నీ ఆయన నేతృత్వంలో జరిగిన ఉమ్మడి పోరాట విజయాలన్నారు. ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవాధ్యక్షుడు మందగిరి వర్ధన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు కోటేశ్వరరావు, ఏడుకొండలు, గోపాల్‌, మొహంతునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️