దళిత, గిరిజన ద్రోహులను ఓడించండి

మాట్లాడుతున్న దళిత సంఘాల నాయకులు

– వామపక్ష అభ్యర్థులను గెలిపించండి

– దళిత సంఘాల పిలుపు

ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా

దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిన వైసిపిని, భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బిజెపిని ఓడించాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సీనియర్‌ దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర నాయకులు పిట్ట వరప్రసాద్‌, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి కూరాకుల సింహాచలం తదితరులు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ఐదేళ్ల పాలన కాలంలో దళితులపై దాడులు పెరిగాయని, స్వయంగా వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ తన కారు డ్రైవర్‌ అయిన సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌ డెలివరీ చేశారని గుర్తు చేశారు. అటువంటి అనంత ఉదయభాస్కర్‌ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయలేదన్నారు. అలాగే మరో వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేసిన కేసులో కోర్టు అతనికి శిక్ష వేసినా, ఆయనకు మండపేట ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చిన వైసిపి దళితుల ద్రోహి పార్టీగా నిరూపించుకుందని తెలిపారు. ఏజెన్సీ గిరిజనులకు రక్షణగా ఉన్న అనేక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్పు చేస్తూ ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని, ఏజెన్సీని, గిరిజనులను కొల్లగొడుతున్న ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మద్దతిస్తున్న వైసీపీ అభ్యర్థిని, ఆదివాసీలకు ద్రోహం చేస్తున్న బిజెపి ఎంపీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న సిపిఎం రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

➡️