మతతత్వ పార్టీ బిజెపిని ఓడించండి..రాజ్యాంగాన్ని కాపాడండి

Apr 23,2024 22:09

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి

కోలాహలంగా కురుపాం అభ్యర్థి మండంగి రమణ నామినేషన్‌

ప్రజాశక్తి కురుపాం /గుమ్మలక్ష్మీపురం  : గిరిజన జీవనానికి ఆటంకంగా ఉన్న కేంద్రంలోని మతతత్వ బిజెపిని, దాని మిత్రపక్షాలైన టిడిపి, జనసేనను, మదతిస్తున్న వైసిపిని రానున్న ఎన్నికల్లో ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ పుణ్యవతి పిలుపునిచ్చారు. ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన కురుపాం నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి మండంగి రమణ మంగళవారం నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వివి రమణకు అందజేశారు. అంతకుముందు రావాడ రోడ్డు నుంచి దూళికేశ్వర ఆలయం వరకు సుమారు కిలోమీటరు పొడవున భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పుల వాయిద్యం, కోలాటం నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌ అధ్యక్షతన జరిగిన సభలో పుణ్యవతి ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న మోడీ రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగించడంతో భారతదేశం ప్రమాదంలో పడిందన్నారు. మతాలను, ప్రాంతాలను విభజించి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా పాలన సాగిస్తోందని అన్నారు. గిరిజనుల పట్ల వివక్షత చూపుతూ దాడులకు పాల్పడడం విచారకరం అన్నారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్‌ వ్యక్తులతో చేతులు కలిపి పరిశ్రమల పేరుతో గిరిజనులను అడవి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం పెద్దపెద్ద రోడ్లు వేస్తున్న ప్రభుత్వాలు, గిరిజన ప్రాంతానికి చిన్నపాటి రోడ్డు కూడా వేయని దుస్థితిలో ఉందన్నారు. ఇదేనా గిరిజనుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రేమ అని ప్రశ్నించారు. గిరిజన సంఘం, సిపిఎం పోరాటాల ఫలితంగానే 1/70 చట్టం, అటవీ హక్కులు చట్టం, పిసా చట్టం, ఉపాధి హామీ చట్టం సాధించుకున్నామని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాకదీ చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిఒ నెంబర్‌ 3 ఎత్తివేయడం తో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఐటిడిఎ, జిసిసి వంటి సంస్థలు ఉన్నా గిరిజనలకు ఎటువంటి ప్రయోజన లేకుండా పోయిందన్నారు. కురుపాం ప్రాంతంలో 1950 నుంచి గిరిజన ఉద్యమాలు జరుగుతున్నాయని, ఈ ఉద్యమాలే మన జీవనానికి ఊపిరి అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి హక్కులు చట్టాలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన మండంగి రమణ, అప్పల నర్సను గెలిపించి చట్టసభలకు పంపించిన నాడే గిరిజన జీవనానికి రక్షణగా ఉంటుందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసిదాస్‌ మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితంగానే తోటపల్లి నిర్వాసితులకు పరిహారం అందిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పక్షనా సిపిఎం ఉద్యమాలు చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని అన్నారు. ఇదే జరిగితే అందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత కరువై రోడ్డున పడతారని అన్నారు. ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కార్పొరేట్‌ వ్యక్తులకు ధారా దత్తం చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గోడు పట్టించుకోవడం లేదన్నారు. పేదలు కార్మికులు గిరిజనులు దళితుల పక్షాన ఉండి పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ గిరిజనలు పక్షాన ఉండి పోరాడుతున్న సిపిఎం పార్టీకి మద్దతు ఇస్తారా? ఓట్ల కోసం వచ్చి ఐదేళ్ల పాలనలో గల్లా పెట్టి నింపు కుంటున్న నాయకులకు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని అన్నారు. ఈ కారణంగానే ధరలు పెరుగుదల, నిరుద్యోగం వెంటాడుతున్నాయని అన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితంగా గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పూర్ణపాడు లాభేసు వంతెన మంజూరు అయిందన్నారు. డిగ్రీ కళాశాల పూర్తయిన, పూర్ణ పాడు లాబేసు వంతెన పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయన్నారు. టిడిపి వైసిపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప వంతెనను పూర్తిచేసే ఆలోచన లేకపోవడం దుర్మార్గపు పాలనకు నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రమణను గెలిపిస్తే ఏడాది లోపు వంతెన పూర్తి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా గిరిజనులకు హామీ ఇచ్చారు.

మతతత్వ పార్టీ బిజెపిని ఓడించండిరాజ్యాంగాన్ని కాపాడండి

అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ తనను ఆశీర్వదించాలని గిరిజనుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని అన్నారు. గత 15 ఏళ్లగా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులను తరలించే చర్యలు చేపట్టడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఏనుగులు దాడిలో ఇప్పటి వరకు 15 మంది వరకు చనిపోయినా, వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిలిన నష్టపరహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పల నరసయ్య మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాల పేరుతో అడవి నుంచి దూరం చేసే కుట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలను కాపాడుకోవాలంటే రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిపించి చట్ట సభలకు పంపించాలని కోరారు.కాంగ్రెస్‌ డిసిసి ఉపాధ్యక్షులు డి.శంకర్రావు మాట్లాడుతూ యుపిఎ హయాంలో అనేక విషయాలపై ఉమ్మడిగా సాధించామని, మళ్లీ ఇండియా వేదికను గెలిపిస్తే ప్రజలకు మేలు జరగుతుందని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గళం వినిపించాలంటే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

➡️