శారీరక, మానసిక ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలి : డిఎంఒ

Apr 7,2024 21:45

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. తరచుగా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండే స్థాయిని నిర్ణయించేది మనలో ఉండే రోగనిరోధక వ్యవస్థ పనితీరు పై ఆధారపడి ఉంటుందని అన్నారు. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండడానికి అవసరమైన జీవనశైలి తప్పనిసరి అని అన్నారు. కానీ ప్రస్తుత మారుతున్న జీవనవిధానంలో అనేక ప్రత్యామ్నాయ మార్గాలు మనిషిని శారీరక శ్రమకు దూరం చేస్తున్నాయని, వీటితో పాటుగా మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణం, పరిసరాలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపి అనేక రుగ్మతలకు దారితీస్తుందన్నారు. ప్రతిరోజూ తగినంత శ్రమ ఉండాలని, అందుకు తగ్గ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. మన శరీరంలో నీరు, లవణాల సమతుల్యతకు అవరోధం లేకుండా ఉండాలని అన్నారు. అందుకు తగ్గ ఆహార నియమాలు పాటించాలన్నారు. శాఖాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, నూనె, కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని చాలా వరకు తగ్గించుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులు మరింత ఆరోగ్యకరమని అన్నారు. అలాగే మనం నివసిస్తున్న ప్రదేశంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు, మురుగు నీరు, చెత్త లేకుండా చూసుకోవాలని సూచించారు. లేకపోతే దోమల ప్రభావం వల్ల పలు అనారోగ్య సమస్యలు సోకుతాయన్నారు. కాలానుగుణంగా ప్రబలే ఆరోగ్య సమస్యలు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. అప్పడప్పుడు మన ఆరోగ్యం విషయమై స్వయం పరిశీలన చేసుకోవడం, ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా జాప్యం చేయక అందుబాటులో ఉన్న వైద్యసేవలను వినియోగించుకోవడం, ఆరోగ్య సూచనలు, సలహాలు పాటించడం మొదలగు వాటివల్ల జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చు అన్నారు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరమని, అనవసరమైన ఒత్తిడి, నిద్రలేమి, దుర్వాసనాలు మొదలగునవి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయన్నారు. నివసించే ప్రదేశాల్లో మొక్కలు, చెట్లు పెంచాలని తద్వారా ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించి ఆరోగ్యం మెరుగుపడేందుకు తోడ్పడుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ ఉండాలన్నారు. ముఖ్యంగా సకాలంలో రోగనిరోధక టీకాలు వేయించడంతో పలు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. గర్భిణుల ఆరోగ్యం చాలా ముఖ్యమని, రక్త హీనత, హైరిస్క్‌ సమస్యలు లేకుండా నివారించడం వల్ల పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా, మెరుగైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారన్నారు..

➡️