ఊ అంటారా.. ఊఊ అంటారా?

Apr 7,2024 21:40

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గంలో టిడిపి అసంతృప్తి నాయకులను బుజ్జగించేందుకు పార్టీ అధినాయకత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగనుంది. టిడిపిలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి, సీనియర్‌ నాయకులు పెంట తిరుపతి రావు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. మక్కువ మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న తిరుపతిరావుతో సమన్వయం చేసుకోడానికి సంధ్యారాణి ససేమిరా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆమెను పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి దాదాపు నెల రోజులు దాటింది. గెలుపు కోసం శత్రువునైనా కలుపుకుని పోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె ఆ దిశగా అడుగులు వేయడం లేదు. సొంత పార్టీ నేతలను వదులుకోవడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నారు. ఆయనంతట ఆయనే పార్టీ విజయం కోసం పని చేస్తారని సంధ్యారాణి ఇంతవరకు ఎదురు చూశారు. సంధ్యారాణి నేరుగా తనతో మాట్లాడితే గాని పార్టీ గెలుపు కోసం పని చేయనని తిరుపతిరావు భీష్మించుకుని ఉన్నారు. ఈలోగా కొంతమంది ఆయన అనుచరులతో సంధ్యారాణి రాయభారం పంపినా తిరుపతిరావు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆమె మాత్రం మక్కువ మండలంలో తన అనుచరులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. సంధ్యారాణితో సయోధ్య కుదరకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిని రంగంలోకి దించాలనే యోచనలో పెంట తిరుపతిరావు వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సంధ్యారాణితో సయోధ్య కుదరాలంటే ముందు తన డిమాండ్లకు తలొగ్గాలనే సంకేతాలను తిరుపతిరావు పంపించారు. మండల పార్టీ అధ్యక్షుడిగా తాను సూచించిన వ్యక్తే వుండాలని, తన కనుసన్నల్లో మండల పార్టీ నడవాలని, తాను ఏది చెపితే అదే జరగాలని తిరుపతిరావు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి తిరుపతిరావు దూరమైన తర్వాత మండల పార్టీ అధ్యక్షుడిగా గుళ్ళ వేణుగోపాలరావును ఆమె నియమించారు. వేణుగోపాలరావు ద్వారానే మండలంలో పార్టీని నడిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత తిరుపతిరావు బిజెపిలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొన్నాళ్లు పని చేశారు. జిల్లాలో బిజెపికి ఎదుగూబొదుగూ లేకపోవడంతో ఏడాది క్రితం ఆయన అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. తిరుపతిరావు చేరికను సంధ్యారాణి తీవ్రంగా వ్యతిరేకించినా అధిష్టానం మాత్రం ఆయనకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌ పెంట తిరుపతిరావు చేరికను స్వాగతించారు. పార్టీలో చేరిన తర్వాత గానీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గానీ సంధ్యారాణి తిరుపతిరావును కలుపుకు పోయే ప్రయత్నం చేయలేదు. పట్టణానికి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గొర్లి విజయకుమారి భర్త, పట్టణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు గొర్లి మధుసూదనరావు ఇటీవల వైసిపిలో చేరారు. మధుసూధనరావుతో కూడా సయోధ్యకు సంధ్యారాణి అంగీకరించకపోవడంతో ఆయన అధికారపార్టీకి దగ్గరయ్యారు. సంధ్యారాణికి సీటు ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌తో పాటు ఆయన అనుచరులు గట్టిగా అధిష్టానానికి చెప్పినా ఫలితం లేకపోయింది. ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న సంధ్యారాణినే ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. అధిష్టానం అభ్యర్థిని ప్రకటించినా పార్టీలో ఆమె వ్యతిరేకులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు ఇంతవరకు చేయలేదు. ఎమ్మెల్యే టికెట్‌ సాధించడంలో విజయవంతమైన సంధ్యారాణి ఎమ్మెల్యేగా గెలుపు సాధించినట్లేనన్న భావనతో వున్నట్లు కనిపిస్తున్నారు. టిడిపి రాష్ట్ర నాయకత్వం ఆదేశించినా సంధ్యారాణి సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావుతో సయోధ్య కోసం ప్రయత్నించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టిడిపి నాయకత్వం రంగంలోకి దిగనుంది. పార్టీ రాష్ట్ర నాయకులు దామచర్ల సత్య, మాజీ మంత్రి సుజరు కృష్ణ రంగారావు మధ్యవర్తిత్వంలో సోమవారం బొబ్బిలిలో సంధ్యారాణి, పెంట తిరుపతిరావుతో చర్చలు జరుపనున్నారు. తన డిమాండ్లను సంధ్యారాణి ఆమోదిస్తే గాని సయోధ్యకు అంగీకరించేది లేదని భీష్మించుకున్న పెంట తిరుపతిరావు అగ్రనేతల సలహాలు సూచనల మేరకు తలొగ్గుతారా, లేదా అన్నది తేలాల్సి ఉంది. తిరుపతి రావు డిమాండ్లకు తలొగ్గి అధిష్టానం పెద్దల సలహాలను సంధ్యారాణి గౌరవిస్తారా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. నియోజకవర్గంలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఆలస్యంగా రంగంలోకి దిగిన అధిష్టానం దూతలు చర్చలు జరిపిన తర్వాత కూడా సంధ్యారాణి ఊ అంటారా,ఊఊ అంటారా సోమవారం తేలిపోనుంది.

➡️