జంఝావతిపై దొందూ… దొందే

Apr 29,2024 21:35

ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంఝావతి సాగునీటి ప్రాజెక్టుపై టిడిపి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి అస్సలు పట్టించుకోలేదు. దీంతో, సుమారు నాలుగున్నర దశాబ్ధాలుగా ఈ ప్రాంతవాసులకు సాగునీటి వెతలు తప్పడం లేదు. టిడిపి పాలనలో 2016లో ఓసారి ప్రభుత్వం తరపున అప్పటి కేంద్ర మంత్రి హోదాలో జిల్లాకు చెందిన పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపగా, మూడున్నరేళ్ల క్రితం సిఎం జగన్మోహన్‌రెడ్డి కూడా అక్కడి సిఎంను కలిసి మమ అనిపించారు. ఈ ప్రాజెక్టుపై ఇటు పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుగానీ, అటు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిగానీ గత పదేళ్లగా ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. అటు ప్రతిపక్ష టిడిపి కూడా ప్రశ్నించలేదు. దీంతో, జంఝావతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మిగిలిపోయింది. ఎన్నికల హామీగా మిగిలి పోయింది.

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి, కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, మక్కువ, గరుగుబిల్లి మండలాల్లో సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద నాగావళి నదికి ఉపనదిగా పేరొందిన జంఝావతిపై జలాశయాన్ని రూ.13.50కోట్ల అంచనా వ్యయంతో 1976లో తలపెట్టారు. అప్పటి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు ఇందుకు చొరవ చూపించారు. ఈ జలాశయం పూర్తికావాలంటే ఒడిశా రాష్ట్రంలో 1175 ఎకరాలు ముంపునకు గురౌతాయి. ఆ పరిధిలోవున్న 250 కుటుంబాల వారు నిర్వాసితులుగా మారుతారు. అప్పట్లో చాలా వరకు పరిహారం చెల్లించడంతో చాలా గ్రామాలు ఖాళీచేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. ఒకే ఒక్క గ్రామంలోని ప్రజానీకం ఖాళీ చేసేందుకు నిరాకరించాయి. ఈ నెపంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, తాత్కాలికంగా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాల్లో 12వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రబ్బరు డ్యాం నిర్మించారు. ఇందులోనూ 6వేల ఎకరాలు నేరుగా రబ్బరుడ్యాం (లోలెవెల్‌ కెనాల్‌) ద్వారాను, మరో 6వేల ఎకరాలు ఎత్తిపోతల పథకం (ఎడమ కాలువ, హైలెవెల్‌ కెనాల్‌) ద్వారా మొత్తంగా 12వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అనంతరం తగినన్ని నిధు లు మంజూరు చేయక పోవడం, మోటార్లు పనిచేయక పోవడం, విద్యుత్‌ బిల్లులు చెల్లించక పోవడం వంటి కారణాల వల్ల హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా చుక్కనీరు అందే పరిస్థితి లేదు. లోలెవెల్‌ కెనాల్‌ పూర్తిగా నిర్మించకపోవడం, నిర్మించిన కాలువనూ ఆధునీకరించకపోవడం వల్ల కేవలం కొమరాడ మండలంలో 2,500 ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో ఒడిశాతో నెలకొన్న చిన్నపాటి వివాదాన్ని పరిష్కరిస్తే మూడు మండలాలు సస్యశ్యామలమౌతాయని, ఇప్పటికైనా స్పందించి వివాదాన్ని పరిష్కరించాలని చాలా కాలంగా జిల్లా వాసులు కోరుతున్నారు. ఎన్నో సార్లు వినతులు, నిరసన కార్యక్రమాలు సైతం రైతుసంఘం, రైతాంగం చేపట్టింది. 2016లో టిడిపికి చెందిన అప్పటి కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపి కె.రామ్మోహన్‌ నాయుడు, అప్పటి పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డి జగదీష్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కూడిన కేంద్ర బృందం ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయిక్‌ను కలిసి ఏదో చేస్తున్నట్టు హడావుడి చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా మూడున్నరేళ్ల క్రితం భువనేశ్వర్‌ వెళ్లి చర్చలు జరిపినట్టు ఫోటోలు విడుదల చేసినప్పటికీ నేటికీ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్యవున్న చిన్నపాటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చొరవ చూపలేదు. ఫలితంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సాగునీటి వెతలు తప్పడం లేదు. పాలకులు పట్టించుకోవడం లేదు జంఝావతి ప్రాజెక్టు కింద తమ భూములున్నాయన్న పేరు తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం తమ భూములకు నీరు అందిస్తున్నట్టు తప్పుడు లెక్కలు చూపుతున్నారు. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఎలాగూ ప్రయత్నించడం లేదు. కనీసం మోటార్లు, ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, బాగుచేస్తే జలాశయానికి కూతవేటు దూరంలోవున్న మాకు సాగునీరు అందేది. పాలకులు పట్టించుకోక పోవడమే ఇందుకు కారణం.- హిమరక రామారావు,డంగభద్ర గ్రామం భూములు కోల్పోయినా సాగునీరు ఇవ్వలేదుజంఝావతి ప్రాజెక్టు, కాలువల నిర్మాణం కోసం భూములు వదులుకున్నాం. అప్పట్లో పరిహారం కూడా పెద్దగా ఇవ్వలేదు. మిగిలిన భూములకు సాగునీరు అందుతుందనే ఆశతో భూములిచ్చేందుకు వెనుకాడలేదు. ఎమ్మెల్యేల చేతగానితనం, ప్రభుత్వాలకు పట్టకపోవడం వంటి కారణాల వల్ల ప్రాజెక్టు పూర్తికాలేదు. 12వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రబ్బరు డ్యాం లక్ష్యం కూడా నెరవేరలేదు. – కె.శ్రీనివాసరావు, అర్తం గ్రామం, కొమరాడ మండలం

➡️