డొంకరాయి పవర్‌ కెనాల్‌ మరమ్మతులకు అనుమతి

మరమ్మతులు చేపట్టనున్న డొంకరాయి పవర్‌ కెనాల్‌ ఇదే...

– 25 నుండి పనులు ప్రారంభం

ప్రజాశక్తి-సీలేరు

ఎపి జోన్కో సీలేరు కాంప్లెక్స్‌ పరిధి దిగువ సీలేరు డొంకరాయి పవర్‌ కెనాల్‌కు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది మరమ్మతు పనులు చేయడానికి ఏపీ జెన్కో ఉన్నతాధికారులు ఎల్‌సి అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ నెల 25 నుంచి వచ్చేనెల 10 వరకు మరమ్మతు పనులు చేయడానికి సీలేరు కాంప్లెక్స్‌ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మరమ్మతు పనులకు రూ.1.50 కోట్ల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. కెనాల్‌ మరమ్మతు పనుల్లో భాగంగా కెనాల్‌ పటిష్టత కోసం కాంక్రీటు, గ్రౌటింగ్‌ పనులు ఏపీ జెన్కో చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్రీధర్‌ ఎస్‌ఈ సివిల్‌ కేకేవి.ప్రశాంత్‌ కుమార్‌, ఇంజనీర్లు పర్యవేక్షణలో చేపట్టనున్నారు. ముందు పవర్‌ కెనాల్‌ నుంచి నీటి విడుదల నిలిపివేసి తరువాత పనులు చేపడతారు. ఈనెల 25 నుంచి కెనాల్‌ మరమ్మతు పనులు చేపడితే సీలేరు కాంప్లెక్స్‌ పరిధి 25 మెగావాట్ల సామర్థ్యం గల డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రం, 460 మెగావాట్ల సామర్థ్యం గల పోల్లూరు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఒక్క ఎగు సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. కెనాల్‌లో నీటి నిలిపివేసిన అనంతరం 16 కిలోమీటర్ల మేర పవర్‌ కెనాల్‌కు ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయి? శిథిలావస్థలో ఏఏ ప్రదేశాలు ఉన్నాయి ముందుగా ఏపీ జెన్కో అధికారులు, ఇంజనీర్లు గుర్తించి ఆయా ప్రదేశాల్లో గ్రౌండ్‌, కాంక్రీట్‌ పనులు చేపడతారు. ఈ పనులు ఏ కాంట్రాక్టర్‌కి అప్పగించింది ఇంతవరకు తెలియరాలేదు.

➡️