ఎండుతున్న చెరువులు.. తడవని గొంతులు

Apr 5,2024 23:23

నీరు లేక ఎండిపోయిన అమరావతి మండలం నరుకుళ్లపాడు చెరువు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు, పల్నాడు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఆరునెలలుగా జిల్లాలో తగిన వర్షాల్లేక చెరువులు, కాల్వలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా తాగునీటికి గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో పశుపోషకులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు పచ్చగడ్డి దొరక్క, కాల్వల్లో నీరు లేక ఎండ తీవ్రతతో పశువులను బయటకు తీసుకువెళ్లడానికి పశు పోషకులు చాలావరకు వెనకంజ వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో 200 గ్రామాల్లో, గుంటూరు జిల్లాలో 100 గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. గత మూడునెలలుగా విడతల వారీగా సాగర్‌నుంచి చెరువులకు నీరు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నా అప్పట్లో తగిన పర్యవేక్షణ లేక చెరువులను పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. కాల్వ చివరి భూముల్లోని చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, ప్రత్తిపాడు, తాడికొండ, పెదకరపాడు నియోజకవర్గాల్లో చెరువుల్లో నీరు నిండుకుంటోంది. దీంతో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి గ్రామాల్లోని బోర్లు కూడా పనిచేయడం లేదు.మరోవైపు నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాల్లోనీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. గత నాలుగు నెలల్లో పులిచింతలలో పూర్తిగా నిల్వలు పూర్తి స్థాయిలో అడుగింటిపోయే ప్రమాదం నెలకొంది. ప్రధానంగా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, దాదాపు 400 గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగపడే పులిచింతల జలాశయంలో గరిష్టనీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా శుక్రవారం రాత్రి కేవలం 3.69 టీఎంసీలకు నిల్వ పడిపోయింది. గతేడాది ఇదే రోజుల్లో పులిచింతలలో నీటి నిల్వ 24 టీఎంసీలుంది. నాగార్జున సాగర్‌లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312.01 టీఎంసీలు కాగా ప్రస్తుతం 134.92 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మొత్తంగా ప్రధాన జలాశయాల్లో కనీస నీటి నిల్వలు లేకుండాపోతున్నాయి. పులిచింతలలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోయి అడుగంటే పరిస్థితి నెలకొంది. పులిచింతలలో నీటినిల్వ బాగా తగ్గిపోవడం వల్ల ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజి గరిష్టనీటి నిల్వ 3.08 టీఎంసీలుగా ప్రకాశం బ్యారేజి వద్ద కనీవిని ఎరగని రీతిలోనీటి నిల్వ కేవలం 1.42 టీఎంసీలకు తగ్గిపోవడం వల్ల ఉమ్మడి కృష్ణా, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రతిఏటా మేనెలలో నీటిఎద్దడి వస్తుందని, కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో సమస్య తీవ్రరూపం దాలుస్తుందని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. పులిచింతల నుంచి శుక్రవారం 4300 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజికి విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ కుడికాల్వకు 8న నీటి విడుదలవేసవిలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు ఈనెల 8వ తేదీన నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వ ద్వారా 5500 క్యూసెక్కుల నీరు ఈనెల 18వ తేదీవరకు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కుడికాల్వ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని అధికారులు అందరూ తమ పరిధిలో 461 సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు తాగునీరు నింపుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి శనివారం డెల్టాపరిధిలోని చెరువులకు నీటి విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

➡️