అభివృద్ధి పనులు అడుగడుగునా డొల్ల

Feb 4,2024 22:14
అభివృద్ధి పనులు అడుగడుగునా డొల్ల

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంనగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు. స్థానిక పుష్కరాల రేవు సమీపంలో… గోదావరి రైల్వే స్టేషన్‌ను అనుకుని ఏర్పాటు చేసిన పుష్కర ప్లాజాను ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడ పైకి లేచి ప్రమాదకరంగా ఉన్న టైల్స్‌ను మీడియాకు చూపించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ పుష్కర ప్లాజా ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించలేదన్నారు. ఈ ఒక్క దానిలోనే కాదని నగరంలో చేపట్టిన, చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టే ఏ అభివృద్ధి పనైనా సరే భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టాలని, తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులన్నీ చాలా నాణ్యతతో చేసినవి కనుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇప్పటి అలానే ఉన్నాయన్నారు. ఎంపీ భరత్‌ రామ్‌, ఆయన అనుచరులు చేసే పనుల్లో నాణ్యత లేదని చెప్పేందుకు పుష్కర ప్లాజా వద్ద చేసిన పనుల్లో బయట పడిన డొల్లతనమే నిదర్శనమన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దోచుకుం టున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ నగర పాలక సంస్థ కమిషనర్‌కు తెలిసినా ఎంపీ భరత్‌ రామ్‌ ఒత్తిడి వల్ల ఆయన ఏ చర్య తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్‌ మాటూరి రంగారావు, టిడిపి నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్‌, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు తవ్వా రాజా, టిడిపి నాయకులు మాటూరి సిద్ధు, ఎంఎన్‌ రావు, నల్లం ఆనంద్‌, గ్రంధి రాజా, కొత్త రాజేష్‌, సిహెచ్‌.శివ, పింకేష్‌, నారాయణ వెంట ఉన్నారు.

➡️