అభ్యర్థుల మోదం.. ఆశావహుల ఖేదం..

Feb 24,2024 23:22
టిడిపి, జనసేన

టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఉమ్మడి జిల్లాలో 9 టిడిపి, 2 జనసేనకు కేటాయింపు
మిగిలిన స్థానాలపై కొనసాగుతున్నఉత్కంఠ
అసంతప్తిలో పలువురు ఆశావహులు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
ఎపిలో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ఆ పార్టీల అధినేతలు శనివారం ప్రకటించారు. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదట జాబితాలో జనసేనకు రెండు, టిడిపికి 9 సీట్లను కేటాయించారు. రాజానగరంలో జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణకు, కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీకి టిక్కెట్లు ఖరారయ్యాయి. టిడిపి నుంచి తుని అభ్యర్థిగా యనమల దివ్యకు, పెద్దాపురం నుంచి మూడోసారి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ భవాని భర్త ఆదిరెడ్డి వాసు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, మండపేట సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, కొత్తపేట మాజీ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు, పి.గన్నవరం మహాసేన రాజేష్‌లకు సీట్లు దక్కాయి. అయితే మిగిలిన స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన చోట్ల అన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్లు ఆశించి భంగపడిన ఆశావహుల నుంచి అసంతృప్తులు, అలకలు ఇరు పార్టీల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు సిట్టింగ్‌ సీట్లపై స్పష్టత రాగా రాజమహేంద్రవరం రూరల్‌లో అక్కడి ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి టికెట్‌ కన్ఫార్మ్‌ చేయలేదు. దాంతో ఆయన అలకపూనినట్లుగా సమాచారం. ఈ నియోజకవర్గంలో పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అన్ని సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గాన్ని మినహాయించడం చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరంలో సిట్టింగ్‌ ఎంఎల్‌శ్రీ ఆదిరెడ్డి భవాని స్థానంలో ఆమె భర్త వాసుకి టిక్కెట్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.పొత్తులో సహకారం దక్కేనా?అన్నిచోట్ల సీట్లు ఆశించిన జనసేన నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. జగ్గంపేట, కొత్తపేట వంటి నియోజకవర్గాల్లో ఆ నేతలు టిక్కెట్టు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయా సీట్లు టిడిపి ఖాతాలోకి వెళ్లడంతో జనసేన నేతలు ఎలా సహకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు తమ శ్రేణులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నారని అందుకు సహకరించాల్సి వస్తుందని ఓట్లు బదిలీ కచ్చితంగా జరగాల్సి ఉంటుందని చెబుతున్నప్పటికీ కింద స్థాయిలో పార్టీ శ్రేణులు మాత్రం తీవ్రమైన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా జగ్గంపేటలో జనసేన ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర గత 90 రోజులుగా ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అనే కార్యక్రమంతో విస్తతంగా పర్యటించి టిక్కెట్‌ తనదే అనే ఆశాభావంతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆశించిన జగ్గంపేట సీటును టిడిపికి కేటాయించడంతో సూర్యచంద్ర, ఆయన అనుచరులు బోరున విలపించారు. కిర్లంపూడి మండలం గోనాడ నుంచి గోకవరానికి భార్యతో కలిసి నిరసనగా పాదయాత్ర నిర్వహించారు. అత్యుతాపురంలో తన తుదిశ్వాస విడుస్తాన్నంటూ ప్రకటించడంతో పాదయాత్రపై ఉత్కంఠ కొనసాగింది. కాకినాడ రూరల్‌లో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి భర్త టిడిపి సీనియర్‌ నేత సత్యనారాయణ మూర్తి రెండు రోజుల క్రితం తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జనసేనకు సహకరించేది లేదని విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. పి.గన్నవరం సీటుని మహాసేన రాజేష్‌కు కేటాయించడంతో ఆగ్రహించిన టిడిపి మండల అధ్యక్షుడు తోలేటి సత్యనారాయణమూర్తి రాజీనామా చేశారు. రాజేష్‌ పేరును ప్రకటించడంపై పార్టీ మండల కార్యాలయానికి తాళం వేసి ఆయన ఈ సందర్భంగా నిరసన తెలిపారు. కొత్తపేట సీటుపై జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్‌ ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా ప్రజలతో మమేకమై భారీగా ఖర్చు కూడా చేశారు. ఆయనను కాదని సీటు మాజీ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావుకు కేటాయించారు. అక్కడ శ్రీనివాసు టిడిపికి ఏ మేరకు సహకరిస్తాననేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ముమ్మిడివరంను మొట్ట మొదటి సీటుగా జనసేన ప్రకటించింది. ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గ నుంచి ఆశలు పెట్టుకున్న పితాని బాలకృష్ణ స్థానంలో దాట్ల బుచ్చిరాజుకి అవకాశం దక్కింది. అటు రాజానగరంలోనూ టిడిపి నేతలు ఇప్పటికే అసంతృప్తిని అధినేత ముందే ప్రదర్శించారు. దీంతో ఈ రెండు స్థానాల్లోనూ జనసేనకు టిడిపి నుంచి సహకారం ఎలా ఉంటుందనేదని వేచిచూడాలి. అలకలు, అసంతృప్తులకు అవకాశం ఇచ్చిన తొలి జాబితాలొనే ఇలా ఉంటే రాబోయే మిగిలిన సీట్ల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

➡️