ఆశల పల్లకిలో ఆశావహులు

Feb 1,2024 22:46
రాజకీయం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు ఆశావహులు మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచార ఆర్భాటాలకు తెర లేపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా యంత్రాంగం ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఓటర్లపై స్పష్టత వచ్చేసింది. దీంతో ఆశావహులంతా అప్రమత్తం అవుతున్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసుకుని టిక్కెట్ల సాధనకు బలాబలాలను నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అధికార పార్టీ ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల జాబితాను విడుదల చేయడంతో ఆ పార్టీలో ఒక స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రకాల పేర్లతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. మరోవైపు టిడిపి, జనసేన నేతలు సైతం తామేమీ తీసికట్టు కాదంటూ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేటలో రా కదలిరా పేరుతో సభ నిర్వహించిన విషయం విదితమే. తాజాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో జిల్లాలో పర్యటించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఇప్పటి వరకూ టిడిపి, జనసేన కూటమిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ పార్టీకి వెళ్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనపర్తి నియోజక వర్గంలో టిడిపి నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గతంలో మాజీ ఎంఎల్‌ఎగానూ సేవలందించారు. తాజాగా ఈ నియోజకవర్గంలో మండపేటకు చెందిన జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. టిడిపి జనసేన పొత్తులో భాగంగా నలమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రచార హోరు ఊపందుకుంది. జనసేన నియోజక వర్గ ఇన్‌ఛార్జి బత్తుల బలరామకృష్ణ జనసేన నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సేవా కార్యక్రమాలు, సంక్రాంతి ఉత్సవాలు పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో అధికార పార్టీ ఎంఎల్‌ఎ, వైసిపి జిల్లా అధ్యక్షులు రాజా, సోదరుడైన జక్కంపూడి గణేష్‌ మండలాల వారీగా కేంద్రీకరించి ప్రజల్లో ఉంటున్నారు. ఈ నియోజక వర్గంలో టిడిపి నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి, పెందుర్తి వెంకటేష్‌ టికెట్‌ ఆశిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే పవన్‌కళ్యాణ్‌ ఈ నియోజకవర్గం నుంచి జనసేన బరిలో ఉంటుందని ప్రకటించడంతో జనసేన శిబిరంలో ఉత్సాహం నెలకొంది. జనసేన నుంచి టిక్కెట్‌ను ఆశిస్తున్న బత్తుల టిడిపి నాయకులను సమన్వయం చేసుకునే పనిలో నిమగమయ్యారు. అందులో భాగంగానే తాజాగా మాజీ ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం నియోజక వర్గంలో వైసిపి సమన్వయ కర్త, ఎంపీ భరత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గుడ్‌ మార్నింగ్‌ పేరుతో రాజకీయ ప్రచారానికి తెరలేపారు. మరో వైపు అదే స్థాయిలో ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవాని, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్న కాంటీన్లను నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లోనూ రాజకీయ ప్రచారం ఊపందుకుంది. వైసిపి సమన్వయ కర్త, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గుడ్‌ మార్నింగ్‌ పేరుతో ఇంటింటికీ పర్యటనలు చేపడుతున్నారు. ఇదే స్థానానికి టిడిపి నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఎంఎల్‌ఎ బుచ్చయ్య చౌదరి పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ సైతం టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఎవరికివారు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిడదవోలు నియోజక వర్గంలో టిడిపి నుంచి బూరుగుపల్లి శేషారావు పోటీలో ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుందుల సత్యనారాయణ అదే పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు జనసేన నియోజక వర్గ ఇన్‌ఛార్జి బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ శ్రీనివాసనాయుడు ఇంటింటికీ ప్రభుత్వం పేరుతో ప్రచార జోరు పెంచారు. గోపాలపురం నియోజక వర్గంలో టిడిపి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు టికెట్‌ ఆశిస్తున్నారు. చంద్రబాబు ఆశీస్సులు మద్దిపాటికి ఎక్కువగా ఉండటంతో ఆయనకే టిక్కెట్‌ ఖరారయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన పార్టీ శ్రేణులను కలుపుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. హోం మంత్రి తానేటి వనితకు గోపాలపురం నియోజకవర్గ సమన్వయ కర్తగా వైసిపి ప్రకటించింది. ఆమె తండ్రి బాబూజీరావు ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలను నిర్వహించి ఐక్యం చేసే పనిలో ఉన్నారు. ఈ నియోజక వర్గంలో జనసేన నియోజక వర్గ ఇన్ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు టికెట్‌ ఆశిస్తున్నారు.కొవ్వూరు నియోజక వర్గంలో టిడిపిలో స్తబ్ధత నెలకొంది. టిడిపి అంతర్గత విబేధాలు రోడ్డుకు ఎక్కడ ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తుంది. ఇలా ఉంటే వైసిపి ఈ నియోజక వర్గానికి గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావును ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో స్థానిక నేతలను సమన్వయం చేసుకునే పనిలో ఆయన నిమగవమయ్యారు. మాజీ మంత్రి జవహర్‌, అదే పార్టీలో మద్దిపట్ల శివరామకృష్ణ రెండు గ్రూపులుగా ఈ నియోజకవర్గంలో అధినేత ఆశీస్సుల కోసం పోటీ పడుతున్నారు.

➡️