ఆశాలపై సర్కారు నిర్బంధం

Feb 8,2024 23:40
ఆశావర్కర్ల

ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీస్‌స్టేషన్లకు తరలింపు
మరి కొందరి గృహనిర్బంధం
సర్కారు తీరుపై నిరసనలు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
‘చలో విజకవాడ’కు బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులను ప్రయోగించి జగన్‌ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంది. అర్ధరాత్రులు అక్రమంగా అరెస్టు చేసి, నిర్బంధాలకు గురిచేసింది. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26చెల్లించాలని, యాప్స్‌ పేర పెంచిన పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం తెల్లవారు జాము నుంచే సచివాలయ పోలీసులు ద్వారా ఆశాల ఇళ్లకు వెళ్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్లలో, బస్‌ స్టేషన్లలో ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఉదయం ఏడు గంటలకు అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ మండపాల్లో, పోలీస్‌ స్టేషన్లలో విజయవాడ వెళ్లే ట్రైన్స్‌ అన్ని వెళ్లిపోయేవరకూ నిర్బంధించారు. అర్ధరాత్రి టికెట్టు కొనుక్కుని ఆర్‌టిసి బస్సులు ఎక్కిన ఆశాలను సైతం రామచంద్రాపురం, ఏలూరు, వడ్డేశ్వరం వద్ద బలవంతంగా దింపి స్థానిక స్టేషన్లకు తరలించారు. జిల్లాలో అన్ని మండలాల్లో ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్యామల సెంటర్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సుందర్‌బాబు, బి.రాజులోవ మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరించారన్నారు. హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడగడానికి వెళ్లిన వారిపై జగన్మోహన్‌ రెడ్డి అసలు రూపం చూపిస్తున్నారని విమర్శించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి అధికారులు, పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, వేధింపులకు దిగడదం శోచనీమయన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నవారిపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆశాల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.రాంబాబు, ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాణి, జయలక్ష్మి, లక్ష్మీదుర్గ, అనూష, రూప, హవేలా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తాళ్లపూడిలో చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఆశావర్కర్ల యూనియన్‌ నాయకులు, ఆశాలను పోలీసులు గహనిర్బంధం చేశారు. యూనియన్‌ మండల నాయకులు సుధారాణి, రాఘవలకు నోటీసులిచ్చారు. కొంతమంది కార్యకర్తలు ముందుగా తరలి వెళ్లడంతో వారిని కొవ్వూరు తదితర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. గోపాలపురం : ప్రజా ఉద్యమాల్ని అణగదొక్కాలని చూస్తే గత పాలకులకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.భగత్‌ హెచ్చరించారు. గురువారం ఆశా వర్కర్లను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండంచారు. గోపాలపురం పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించిన ఆశావర్కర్లను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆశాలు నిరసన వ్యక్తం చేశారు. భగత్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా నిర్బంధాలపైనే దృష్టి పెడుతుందన్నారు. పాదయాత్రల పేరుతో అధికారంలోకి వచ్చి హామీలను విస్మరించారన్నారు. రాజ్యాంగబద్ధమైన నిరసన హక్కును కాలరాయడం దుర్మార్గమన్నారు. ఆశాలు చేస్తున్న వెట్టిచాకిరి ప్రభుత్వానికి ఎందుకు కన్పించట్లేదన్నారు. దేవరపల్లి : ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. వారిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.భగత్‌, సిఐటియు మండల అధ్యక్షులు టిపి.లక్ష్మి పరామర్శించారు. అక్రమ అరెస్టులను ఖండించారు. వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడం చేతగాక ముందస్తుగా నిర్బంధించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నమనేని సత్యనారాయణ, కె.రత్నాజీ, ఐ.శ్రీనివాస్‌, ఎం.మోహన్‌కళ్యాణ్‌ ఆశా యూనియన్‌ నాయకులు ఎం.వెంకటలక్ష్మి, కె.బుజ్జమ్మ, టి.భారతి, ఎం.సరోజిని పాల్గొన్నారు. పెరవలి : మండలం వివిధ గ్రామాల నుండి గురువారం చలో విజయవాడ కు 5ఆటోల్లో వెళుతున్న ఆశ వర్కర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎజిఎస్‌.మూర్తి తెలిపారు

➡️