ఓటే వజ్రాయుధం : కలెక్టర్‌

Feb 29,2024 22:21
పోలింగ్‌

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
మన దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజల చేతిలో వజ్రాయుధమని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్‌లోని పోలింగ్‌ కేంద్రాలను నియోజకవర్గం ఆర్‌ఒ, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగ్‌ రోజున తప్పకుండా ఓటు వెయ్యాలని కోరారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ప్రభుత్వాధికారులు, సిబ్బంది ఉదయమే ఓటు వేసి విధులకు హాజరవుతారని చెప్పారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యత నిర్వర్తించాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 73.81 శాతం ఓటింగ్‌ నమోదైతే కొన్ని కేంద్రాలలో 32 నుంచి 50లోగా, కొన్ని పిఎస్‌లలో 50 నుంచి 55 శాతం వరకే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు గుర్తించా మన్నారు. బిఎల్‌ఒలతో మాట్లాడుతూ, నియోజకవర్గ సగటు కంటే తక్కువ పోలింగ్‌ జరిగిన పిఎస్‌ల వారీగా వివరాలు అందుబాటులో ఉంచామని, ఆయా ఓటరు జాబితా అనుసరించి గతంలో ఓటు వెయ్యని వారి వద్దకు వెళ్లి చైతన్యం తీసుకుని రావాలని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైన పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం ద్వారా ప్రత్యేక స్వీప్‌ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పిఎస్‌లను గుర్తించి, అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఆర్‌ఒ ఆధ్వర్యాన చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా పలువురు ఓటర్లతో సంభాషించిన కలక్టర్‌ రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఇన్సీసుపేట, ఆల్కట్‌ గార్డెన్స్‌, సాయి కృష్ణ థియేటర్‌ ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కలెక్టర్‌ వెంట తహశీల్దారు వైకెవి.అప్పారావు, డిటి ఎంకె సుధీర్‌ పాల్గొన్నారు.

➡️