కష్టాల్లో ప్రయివేట్‌ టీచర్స్‌

Feb 18,2024 22:59
కష్టాల్లో ప్రయివేట్‌ టీచర్స్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. రేషనలైజేషన్‌ పేరుతో టీచర్‌ పోస్టుల్లో కోత విధించడంతో డిఎస్‌సి ప్రకటించినా ఆశించిన స్థాయిలో ఖాళీలు లేవు. మరోవైపు విద్యా సంవత్సరం ముగింపు నేపథ్యంలో యాజమాన్యాలు సెలవులకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధిని వదులుకోలేక, డిఎస్‌సి పోటీ పరీక్షలకు సిద్ధం కాలేక అవస్థలు పడుతున్నారు. మెగా డిఎస్‌సి విడుదల చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వైసిపి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో రోజుకు 12 గంటలకు పైగానే ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి ఏటా అడ్మిషన్ల లక్ష్యం చేరుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. గడిచిన నాలుగేళ్లలో ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు.ఎన్నికల ముందు ఎట్టకేలకు డిఎస్‌సిజిల్లాలో 205 ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 2400 మంది ఉపాధ్యాయున్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నయి. అత్యధిక మంది పీజీలు చేసినవారున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న విద్యా రంగంలో రెగ్యులర్‌ ఉద్యోగాల కోసం దీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. కొందరు వయోభారం మీద పడటంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఈ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఎట్టకేలకు ఎన్నికల ముందు డిఎస్‌సి ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డున పడ్డారు. కుటుంబాలను పోషించుకోవడానికి కొందరు రోడ్లుపై టీకొట్లు పెట్టుకోవాల్సి వచ్చింది. మరికొంత మంది ఉపాధ్యాయులు కరోనాకు గురై చికిత్స చేయించుకోవడానికి నగదు లేక మరణించిన ఉదాహరణలున్నాయి. ఎన్నికల హామీలు బుట్టదాఖలు ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఎలాంటి పథకాలు లేవు. వారికి ఆరోగ్య శ్రీకార్డులు లేవు. నవరత్నాల పథకాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రైవేటు టీచర్లకు పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండటం లేదు. ఎన్నికల మందు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అన్నీ మర్చిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించాం.. వైసిపి ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టం చేసి వారికి కనీసం వేతనం రెగ్యులర్‌గా వచ్చేలా చూస్తాం.. పని గంటలు, సెలవులు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి నిబంధనలు వర్తింప చేస్తాం.’ అని ఎన్నికల ముందు పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతి మర్చిపోయారు. దీంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️