కార్మికుల పొట్టకొట్టిన బిజెపిని ఓడించాలి

Feb 18,2024 23:00
కార్మికుల పొట్టకొట్టిన బిజెపిని ఓడించాలి

ప్రజాశక్తి-రాజమహేంరదవరంకార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్న బిజిపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని సిపిఎం నాయకులు పిలుపు ఇచ్చారు. జిఎస్‌.బాలాజీదాస్‌ 21వ వర్థంతి, బిబి.నాయుడు 7వ వర్థంతి సందర్భంగా పేపరుమిల్లు వద్ద గల బిటిఆర్‌.భవన్‌లో ఆదివారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి అధ్యక్షతన నిర్వహిరచిన సభలో బాలజీదాస్‌, బిబి.నాయుడు చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడారు. బాలాజీదాస్‌ విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక సంఘాల నిర్మాణంలో, కార్మికులను ఐక్యం చేయడంలో బాలజీదాస్‌, బిబి.నాయుడు ఎంతో కృషి చేశారని, హక్కుల సాధనకు యాజమాన్యాలతో ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్స్‌గా మార్చి కార్మికుల హక్కులు హరించారన్నారు. పారిశ్రామిక యాజమాన్యాలు మోదీ మీద ఒత్తిడి చేసి తమ లాభాలు పెంచుకోవడం కోసం కార్మిక చట్టాలను మార్చేశారని చెప్పారు. యాజమాన్యాలు కార్మికులపై పనిభారం, హక్కులు హరించడం, వేతనాలు తగ్గించడం, సౌకర్యలు కుదించడం వంటి పనులు చేస్తున్నాయని అన్నారు. రైతులు ఢిల్లీలో పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, విద్యుత్‌ సంస్కరణ బిల్లు రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, దేశంలో రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి తీరిక లేని మోదీ దేశంలో కార్పొరేట్లకు లాభాలు పెంచే విధానాలు రూపొందించేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. లేబర్‌ కోడ్స్‌ రూల్స్‌ రూపొందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. కార్మికుల హక్కులు కాల రాయడంలో వైసిపి ప్రభుత్వం ముందుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలను రాష్ట్రంలో ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఈ సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జువ్వల రాంబాబు, సిఐటియు నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ సభలో కె.రామకృష్ణ, వి.రాంబాబు, సుధ, విజయగౌరి, ప్యారీలింగం, సోమేశ్వరావు, అప్పల నరసయ్య, పడాల రామకృష్ణ, కోటేశ్వరావు, రుద్ర, రామకృష్ణ, పిఎస్‌ఎన్‌.రాజు, రాజా, శంకర్‌, వెంకటేశ్వరావు, కాంతారావు, వై.రాము పాల్గొన్నారు.

➡️