కార్ల్‌ మార్క్స్‌కు సిపిఎం ఘన నివాళి

Mar 14,2024 23:42
కార్ల్‌ మార్క్స్‌కు సిపిఎం ఘన నివాళి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, దేవరపల్లికార్ల్‌ మార్క్స్‌ 114 వర్థంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్‌ వద్ద సిపిఎం కార్యాలయంలో మార్క్స్‌ చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడుతూ మార్క్స్‌ ప్రపంచ కార్మికవర్గానికి దాస్‌ కాపిటల్‌, పెట్టుబడి గ్రంథాలను అందించారని కార్మిక వర్గం దోపిడీకి ఎలా గురవుతుందో చెప్పి, దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని చైతన్యం కలిగించారన్నారు. ప్రాణ స్నేహితులైన మార్క్స్‌, ఎంగెల్స్‌ చనిపోయే వరకు ప్రపంచంలో కార్మిక వర్గం పక్షాన ఎన్నో రచనలు చేసి కార్మిక వర్గ విముక్తికి తోడ్పడ్డారన్నారు. మార్క్స్‌ చనిపోయాక మార్క్స్‌ సమాధి వద్ద కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారని, నేడు 180 దేశాల్లో మార్క్స్‌ వర్థంతి, జయంతి సభలు జరుపుతున్నారని చెప్పారు. ఆనాడు మార్క్స్‌ చెప్పినట్టుగా నేడు ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో దీని నుంచి గట్టెక్కేందుకు మార్క్స్‌ పెట్టుబడిలో ఎక్కడైనా చెప్పి ఉంటాడని పెట్టుబడిదారులు, మతాధిపతులు సైతం మార్క్స్‌ గ్రంథాన్ని అధ్యయనం చేశారన్నారు. మార్క్స్‌ సిద్ధాంతం దోపిడీ అంతం అయ్యే వరకు చెక్కుచెదరదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్లలో దేశంలో కార్మిక వర్గాన్ని తీవ్రంగా దోపిడీ చేస్తోందన్నారు. కార్మికవర్గం మీద దాడులు పెరిగాయన్నారు. దేశంలో మోడీ అనుసరిస్తున్న కార్మిక, కర్షక విధానాల వల్ల దేశంలో కార్మిక కర్షకులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మోడీ ప్రభుత్వం దోపిడీదారులకు కొమ్ముకాస్తూ దేశంలో ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెంచిందని విమర్శించారు. మోదీ నాయకత్వంలో బిజెపిని గద్ది దించడంతోనే కార్మికవర్గం దేశంలో కాస్త ఊపిరి పీల్చుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలను, ఓడించాలని కార్మిక వర్గాన్ని బలపరిచే వామపక్ష పార్టీలను వారి మిత్రులను గెలిపించడం ద్వారా కార్మిక వర్గం నిలదొక్కుకుంటుందన్నారు. ఇదే మార్క్స్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తులసి, బి.పవన్‌, రాజులోవ, ఎన్‌.రాజా, సిపిఎం నాయకులు టి.సావిత్రి, ఐ.సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.దేవరపల్లిలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఉండవల్లి కృష్ణారావు నివాసంలో మార్క్స్‌కు ఘనంగా నివాళి అర్పించారు. శ్రామిక వర్గ విముక్తికి మార్క్స్‌ దారులు చూపాడన్నారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ మాట్లాడుతూ మార్క్స్‌ సేవలన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.రత్నాజీ, సిఐటియు మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లిపూడి వెంకటలక్ష్మి, మహిళా సంఘం నాయకురాలు ఉండవల్లి ప్రభావతి, కె.ఉమ, ఎ.బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️