క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి

Jan 31,2024 23:12
క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంభారతదేశం జనాభాలో చైనాతో సమానంగా ఉన్నా, క్రీడాకారులు మాత్రం ఆ విధంగా లేరని, దీనికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. బుధవారం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, జేసీ తేజ్‌ భరత్‌, కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ హాజరయ్యారు. ముఖ్య అతిథి ఎంపీ భరత్‌ మాట్లాడుతూ దేశంలో క్రీడాకారులకు కొదవ లేదని, అయితే వారిని ప్రోత్సహించి తర్ఫీదు ఇవ్వడానికి అవసరమైన కనీస సౌకర్యాలు లేవన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటుతున్నా క్రీడా రంగంలో మన దేశం ప్రతిభ చూపకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమన్నారు. గ్రామీణ యువతకు క్రీడలపై ఆసక్తి ఉన్నా వారికి సరైన శిక్షణ ఇచ్చేవారు లేరన్నారు. ఒలంపిక్స్‌లో స్వర్ణ, రజిత, కాంస్య మెడల్స్‌ 900 ఉన్నా ఎందుకు భారతీయులు సాధించలేకపోతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు, పాలకులపై ఉందన్నారు. పార్లమెంటులో పదేపదే ఎంపీలు ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చర్చించగా, వత్తిడి చేయగా స్పోర్ట్స్‌ బడ్జెట్‌ రూ.2 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలోని ప్రతిభ వెలికి తీసేందుకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇది తొలి అడుగని.. ఇక్కడితో ఆగకుండా క్రీడాకారులకు అన్ని విధాలా శిక్షణ ఇవ్వడం, వారి సాధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️