పవన్‌ ఆశయానికి ఆదిలోనే తూట్లు

Jun 23,2024 21:48
పవన్‌ ఆశయానికి ఆదిలోనే తూట్లు

ప్రజాశక్తి-కడియం కోటి ఆశలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఆశయానికి ఆదిలోనే తూట్లు పడే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల్లో మొదటిగా చెప్పు కొనేది ఇసుక దోపిడి ఒకటి. తాజాగా ఎన్నికైన ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇంటా బయటా విమర్శలు పాలవుతోంది. మళ్లీ మనమే వస్తాం అంటూ రూ.కోట్ల విలువైన ఇసుకను గత ప్రభుత్వం గోదావరి నది చెంతన భారీగా నిల్వ చేసింది. అది తాజాగా ఎన్నికైన కొత్త ప్రభుత్వంలోని కొందరికి వరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పంజా విసురుతున్నారు. ఏమాత్రం లెక్కా పత్రాలూ లేకుండా ఇష్టానుసారంగా రేయింబవళ్లు ఎంఎల్‌ఎ పేరు చెప్పి అమ్మేస్తున్నారు. రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం, తాతపూడి రీచ్‌లో దోపిడీని ప్రతిపక్ష నేతలు బహిర్గతం చేయడంతో అక్కడ తవ్వకాలు నిలిచినప్పటికీ, మండలంలోని బుర్రిలంక – వేమగిరి ర్యాంప్‌లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. స్థానికులు చేస్తున్న విమర్శలతో కరుడుగట్టిన జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఎంఎల్‌ఎ గోరంట్ల తక్షణం ఇసుక అమ్మకాలను నిలిపివేయించి పేదవాడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️