పులి సంచారంతో బెంబేలు

Feb 1,2024 22:50
పులి

ప్రజాశక్తి- గోపాలపురం, తాళ్లపూడి
గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో పులిసంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గోపాలపురం మండలంలో జగన్నాథపురం, కరిచర్లగూడెం పరిధిలోగల మాతంగమ్మ మెట్ట మధ్యలో పులి సంచరిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎల్‌.ధనరాజు తెలిపారు. మాతంగమ్మమెట్ట మెట్ట వద్ద పొగాకు తోటలో పులి పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. ఈ పులి జాడను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 20 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పులి కరకపాడు అటవీ ప్రాంతం ద్వారా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జగన్నాథపురం, కరిచర్లగూడెం, కోమటికుంట పరిధిలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం సబ్‌ డిఎఫ్‌ఒలు, పోలవరం రేంజ్‌ ఆఫీసర్‌ దావీదురాజు, వేణుగోపాల్‌, ఎఫ్‌బిఒ కార్తిక్‌ , శ్రీను, శ్రీశైలం టైగర్‌ టీమ్‌ సభ్యులు పులి తిరిగిన ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. సోషల్‌ మీడియా, వాట్సప్‌ల్లో కొంత మంది వీడియోలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నార్నారు. వాటిని నమ్మొద్దని అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. తాళ్లపూడి మండలంలో తాడిపూడి ఇసుక రీచ్‌ వద్ద పనిచేసే కార్మికులు గురువారం సాయంత్రం పులిని గుర్తించారు. ఇసుకర్యాంపులో పులి నడిచి వెళ్లడం గుర్తించి పక్కనే గల చిన్న గదిలోకి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని వీడియో లో బంధించారు. ఇది తాడిపూడి నుండి తాళ్లపూడి వైపుగా వెళుతున్నట్లు కనబడుతోంది.

➡️