పూర్తి కాని ఇరిగేషన్‌ ప్రాజక్టులు

Feb 3,2024 23:57
పూర్తి కాని ఇరిగేషన్‌ ప్రాజక్టులు

ప్రజాశక్తి-గోపాలపురంవైసిపి ప్రభుత్వంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో లక్షలాది ఎకరాల పంట పొలాలకు నీరు అందడం లేదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. శనివారం మండలంలోని గుడ్డిగూడెం వద్ద గల చింతలపూడి ప్రాజెక్ట్‌ స్టేజ్‌ టు పంపు హౌస్‌ను దేవినేని ఉమా, టిడిపి నాయకులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సుమారు పది లక్షల ఎకరాలకు నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు రూ.5000 కోట్ల నిధులు మంజూరు చేసి అప్పట్లోనే రూ.4,101 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ వద్ద 7 వేల క్యూసెక్కుల నీరు తోడేందుకు పంపు హౌస్‌ నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు పది లక్షల ఎకరాల వరకు నీరు అందించడం ద్వారా బీడు భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. టిడిపి హయాంలో 72 శాతం పోలవరం పనులు పూర్తయినప్పటికీ ఈ వైసిపి ప్రభుత్వం మిగిలిన పనులు నేటికీ పూర్తి చేయలేక పోయిందన్నారు. కేవలం ఇరిగేషన్‌ రంగంలో నిధులు ఖర్చు చేసిందల్లా మెయింటినెన్స్‌కు జీతాలకు మాత్రమే ఖర్చు చేసుకున్నారని అన్నారు. పురుషోత్తపట్నం, దేవీపట్నం పంపు హౌస్‌లకు తాళాలు వేశారని, తెలుగు గంగ గాలేరు పట్టిసీమ, స్వర్ణ యుగం ఇరిగేషన్‌ రంగం పనులు ఆగిపోయాయని అన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే రెండు పంటల నుండి మూడు పంటల వరకు పంటలు పండుతాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఇరిగేషన్‌ పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10 నియోజకవర్గాలలో అందించవచ్చని చెప్పారు. వైసిపి ప్రభుత్వం ఇరిగేషన్‌ పనులు నిలుపుదల చేయడం వల్ల ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదని అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈలి శరత్‌బాబు, కొర్లపాటి రాము, జ్యెష్ట శ్రీనివాస్‌, మద్దిపాటి రమేష్‌ ఉన్నారు.

➡️