పెద్దపులి దాడిలో రెండు మేకలు మృత్యువాత

Feb 23,2024 23:23
పెద్దపులి

ప్రజాశక్తి – గోపాలపురం
పెద్దపులి దాడిలో రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో మండంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మండలంలోని కరగపాడు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని రాజమహేంద్రవరం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎల్‌.ధనరాజు తెలిపారు. గురువారం సాయంత్రం పెద్దపులి తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ సమీపంలో ఉందని అంచనా వేశామన్నారు. శుక్రవారం ఉదయానికి మతంగమ్మ మెట్ట, నందిగుడెం గ్రామాల మీదుగా కరకపాడు అటవీ ప్రాంతానికి చేరిందని తెలిపారు. కరకపాడు పంచాయతీ బుచ్చియపాలెం గ్రామానికి చెందిన బొమ్మిన బాబూరావుకు చెందిన రెండు మేకలను పెద్దపులి చంపేసిందని తెలిపారు. వాటిని తినకుండా అక్కడే వదిలేసింది. వీటిని చూసి రైతు అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. ప్రస్తుతం పెద్ద పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో పాపికొండల అభయారణ్యంలోకి చేరే అవకాశం ఉందన్నారు. పెద్దపులి జాడ కనిపెట్టేందుకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాయంత్రం 5 గంటలు దాటిన ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. అటవీ ప్రాంతంలో పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలన్నారు. కుదిరితే పనులను వాయిదా వేసుకోవాలన్నారు. ఈ ఆపరేషన్‌లో పోలవరం రేంజ్‌ అధికారి దావీదురాజు, డిఆర్‌ఒ వేణుగోపాల్‌, ఎఫ్‌బిఒ కార్తీక్‌, శ్రీను, పోలవరం రేంజ్‌ సిబ్బంది, పాల్గొన్నారు.

➡️