ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం

Mar 30,2024 23:51
ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురంపిఠాపురం నుంచి విజయ భేరి ఎన్నికల శంఖారావానికి శనివారం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శ్రీకారం చుట్టారు. ఏప్రియల్‌ రెండో తేదీ వరకూ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొల్లప్రోలు చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ తొలుత మాజీ ఎంఎల్‌ఎ, పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జ్‌ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ నివాసానికి నేరుగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. గొల్లప్రోలులో హెలికాప్టర్‌ దిగిన పవన్‌ కళ్యాణ్‌కు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుని ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్‌ వద్ద కాకినాడ జనసేన పార్లమెంట్‌ అభ్యర్థి ఉదయశ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, పెద్దాపురం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ తుమ్మల బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పిఠాపురం మండలంలోని దొంతమూరుకు రోడ్‌ షోలో పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారు. దొంతమూరులో మాజీ ఎంఎల్‌ఎ వర్మ నివాసానికి చేరుకోగానే టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పవన్‌ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఆత్మీయంగా వర్మను పలకరించి పూల బొకే ఇచ్చి అభినందించారు. టిడిపి జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ సుజాయ కృష్ణ రంగారావు, వర్మతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ గంటకుపైగా ఎన్నికల ప్రచార అంశాలు వ్యూహంపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న వర్మ అభిమానులకు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలకు పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వర్మ తన కోసం అసెంబ్లీ సీటును త్యాగం చేశారని, ఆ త్యాగాన్ని తాను ఎప్పుడు మర్చిపోలేనని, వర్మకు కూడా తాను అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పొత్తు ధర్మం ప్రకారం తనను గెలిపించే బాధ్యత తీసుకున్న వర్మకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సరైన వైద్యం అందించడం కోసం మూడు మండలాల్లో మల్టీ స్పెషాలిటీ సేవలు అందేలా కషి చేస్తానన్నారు. ఇక్కడి రైతులు, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యు.కొత్తపల్లి సెజ్‌లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండన్నారు. గొల్లప్రోలులో ముంపు, చేబ్రోలులో పట్టు రైతులకు ఏమి చేశారని వైసిపి నేతలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉప్పాడ తీరం కోతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పట్టు రైతులు, మిర్చి రైతులు నష్టపోతున్నారన్నారు. తనను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి మిథున్‌ రెడ్డి, మండలానికి ఒక కీలక నేతను పెట్టారన్నారు. తన దగ్గర అంతగా శక్తి లేకపోయినా ఎందుకంత కక్ష పెట్టుకున్నారని ప్రశ్నించారు. సుద్దగడ్డ ఆధునీకరణ లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రూ.175 కోట్లు నిధులు వచ్చినా ఎందుకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. గడచిన ఐదేళ్లలో ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తీర ప్రాంతం కోతకు గురవుతున్నా సరైన ప్రణాళికలు చేయలేకపోయారని విమర్శించారు. కోనపాపపేటలో రసాయన పరిశ్రమలు వల్ల మత్స్యకారులకు ఉపాధి పోతున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదన్నారు.స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకుంటానన్నారు కాకినాడ పోర్టులో డీజిల్‌, డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందన్నారు. అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతూ పోర్టు అడ్డాగా మారిందని తీవ్ర విరుచుకుపడ్డారు. మాఫియా డాన్‌ అంటూ పరోక్షంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారులను అవమానించేలా మాట్లాడుతున్నారని అటువంటి వ్యక్తిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.తనను గెలిపిస్తే పిఠాపురం నియోజవర్గానికి రుణపడి ఉంటానని, ఇక్కడే ఇల్లు తీసుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటానని తెలిపారు. 54 గ్రామాల బాధ్యతను తీసుకుని అభివద్ధి చేస్తానని, అన్ని కులాలని సమానంగా చూసి, అన్ని మతాలను ఒకేలా గౌరవిస్తానని చెప్పారు. దేశం మొత్తం గర్వించేలా పిఠాపురాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తానని హామీ ఇచ్చారు .ఇప్పటి వరకూ జరగని అభివద్ధిని చేసి చూపిస్తానని, పిఠాపురంలో పశువుల సంత అభివద్ధికి కృషి చేస్తానని, ఉప్పాడ జట్టీ నిర్మించడమే కాక తీరానికి రక్షణ కోసం ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఏలేరు ఆయకట్టు రైతాంగ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. సుద్ధగడ్డ ఆధునీకరణ వెంటనే చేపడుతామన్నారు. పిఠాపురంను సీడ్‌ హబ్‌గా అభివద్ధి చేస్తామన్నారు. ఉద్యాన పంటల అభివద్ధికి మరింత కషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో మిర్చి, పట్టు రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ సెజ్‌లో పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని, స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివద్ధి చేయడం ద్వారా ఎంతో ఉపాధి లభిస్తుందన్నారు. టెంపుల్‌ హబ్‌గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడిన తనను గెలిపించాలని కోరారు. పవన్‌ సభలో అపశృతిచేబ్రోలు గ్రామంలో జరిగిన పవన్‌ వారాహి విజయ యాత్ర సభలో అపశృతి చోటు చేసుకుంది.పవన్‌ ప్రసంగిస్తుండగా జరిగిన తోపులాటలో కొందరు కింద పడ్డారు. కింద పడ్డ వారిని తొక్కడంతో ఒక బాలుడికి కాలు విరిగింది. దీంతో పాటు మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

➡️