ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం

Feb 3,2024 23:54
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించేందుకు ఆడుదాం ఆంధ్రా గొప్ప సువర్ణ అవకాశం అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా సంబరాల ముగింపు వేడుకల్లో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిసెంబర్‌ 26న ఆర్ట్స్‌ కళాశాలలోనే ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్రా క్రీడలు నిర్వహించడంలో రెండు అంశాలు గమనించాల్సి ఉందన్నారు. ఒకటి రాష్ట్రంలోని యువతకి క్రీడల్లో ఉన్న ప్రతిభ గుర్తించడం, రెండు పిల్లల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత వారి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. యువతీ యువకులు క్రీడలను తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలని, ఆ మేరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె సూచించారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ క్రీడాకార్లకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించేందుకు కషి చేస్తామన్నారు. ఇదే క్రీడా స్ఫూర్తితో విశాఖపట్నంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ జరిగే పోటీల్లో పాల్గొని, జిల్లాకు పతకాలు సాధించి పెట్టాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. పోటీల్లో విజేతలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణలో జాయింట్‌ కలెక్టర్‌, స్పోర్ట్స్‌ అధికారులు, ఇతర సమన్వయ కమిటీ అధికారుల భాగస్వామ్యం అభినందనీయం అన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.యశ్వంత్‌, బీచ్‌ వాలీబాల్‌ క్రీడాకారిణి వై.లలితా దేవి, టెన్నిస్‌ క్రీడాకారుడు పి.శివాజీ, ఫుట్‌ బాల్‌ క్రీడా కారుడు కె.రాజేష్‌, జిల్లా క్రిడాధికారి డిఎం.శేషగిరి, ఆర్‌డిఒ ఎ.చైత్రవర్షిణి పాల్గొన్నారు.

➡️