ప్రజా పంపిణీలో అక్రమాలపై కఠిన చర్యలు

Jun 28,2024 23:14
ప్రజా పంపిణీలో అక్రమాలపై కఠిన చర్యలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. కాకినాడ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పౌరసరఫరాల ఎండీ వీరపాండ్యన్‌, కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి మనోహర్‌ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ ద్వారా రూ.36,300 కోట్లు అప్పులు చేశారన్నారు. రూ.1600 కోట్లు రైతులకు అప్పులు ఉంచి వెళ్లారన్నారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా రేషన్‌ మాఫియా జరిగిందని ఆరోపించారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని ద్వారంపూడి కుటుంబం రాజ్యమేలిందన్నారు. అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి ఒక ప్రత్యేక మాఫియాను నడిపించారన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటివి చెల్లవని, అధికారులు పద్ధతులు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. సమావేశం అనంతరం అధికారు కలిసి పోర్టును పరిశీలించారు.రైతుల సమస్యలపై సమీక్షతొలుత చేపట్టిన పౌర సరఫరాల శాఖ సమీక్షలో గత ఖరీఫ్‌ సీజన్‌లో నిర్వహించిన ధాన్యం సేకరణ, రబీలో సేకరణ ప్రగతిని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి మంత్రికి వివరించారు. గత సీజన్‌లో నమోదైన ఈ క్రాప్‌ బుకింగ్‌ శాతం, ధాన్యం సేకరణలో ఆర్‌బికెల వద్ద, మిల్లుల వద్ద రైతులు ఎదుర్కొన్న సమస్యల వివరాలను మంత్రి అధికారులను అడిగారు. ఆర్‌బికెల వద్ద గుర్తించిన తేమ శాతం కంటే మిల్లర్ల వద్ద తేమ శాతం ఎక్కవ రీడింగ్‌ రావడం వల్ల అదనంగా ధాన్యం ఇవ్వవలసి వచ్చి నష్టపోయామని, నాణ్యత లేని, రంధ్రాలు పడిన గోనె సంచులు సరఫరా చేసారని పలు చోట్ల రైతులు తెలిపినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. తేమ నిర్ధారణలో మోసపోయిన రైతుల నుంచి ఫిర్యాదులు సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించి, రైతులను మోసగించిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిసిఆర్‌సి కార్డుల జారీ అంశంపై సమీక్షిస్తూ 2019 నాటికి జిల్లాలో కౌలు రైతుల శాతం 79 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది గణనీయంగా తగ్గిపోవడం పడిపోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది కౌలు రైతులేనని, వారి సంక్షేమం కోసం చట్టాల్లో అవసరమైన మార్పులను ప్రభుత్వం చేపడుతుందనితెలిపారు. ప్రజాపంపిణీ, మద్యాహ్న భోజన పధకం అమలు అంశాల్లో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వలోపం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పిడిఎస్‌ ద్వారా గోధమ పిండి కోసం కార్డుదారుల నుండి డిమాండు ఉన్నప్పటికీ, ఏప్రియల్‌ నెల నుండి అవసరమైన సరఫరా కోసం పౌర సరఫరా అధికారులు ఇండెంట్‌ చేయకపోపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్‌ డిటిలు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన నాణ్యమైన బియ్యాన్ని సక్రమంగా వినియోగిస్తున్నదీ లేనిదీ తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాలల్లోని మత్స్యకార కాలనీలలో నివసిస్తున్న కుటుంబాలకు అదనపు సరఫరాలు అందించేందుకు వీలుగా వినూత్న విధానాన్ని ప్రతిపాదించాలని కోరారు. పంపిణీ ప్రక్రియ నుండి వైదొలగిన యండియు ఆపరేటర్ల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆర్డిఓలను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 251 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తనిఖీలు నిర్వహించగా, 189 పాయింట్లలో నిల్వల వ్యత్యాసాలు గుర్తించినట్టు మంత్రి మనోహర్‌ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన సప్లయిర్స్‌పై కేసులు పెట్టి బ్లాక్‌ లిస్ట్‌ చేశామని మంత్రి తెలిపారు. అధికారులు పారదర్శకంగా, నిజాయితీగా పనిచేయాలని, దోపిడీదారులకు సహకరించే వారిని ఉపేక్షించమన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్‌బికెలలో చేరి అక్రమ ధాన్యం కొనుగోళ్లతో రైతులను మోసం చేసి దోచుకున్న ప్రయివేట్‌ వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరారు. కాలువల ద్వారా పొలాకు సక్రమంగా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, కాల్వ పూడికలను చేపట్టాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, ప్రత్తిపాడు ఎంఎల్‌ వరపుల సత్యప్రభ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ సగిలి మాట్లాడుతూ సమీక్షలో మంత్రి సూచించిన అంశాలను ఆయా శాఖల సమన్వయంతో అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డాక్టర్‌ కె.తిప్పేనాయక్‌, ఆర్‌డిఒలు ఇ.కిషోర్‌, జె.సీతారామరావు, వ్యవసాయ శాఖ జెడి విజరు కుమార్‌, పౌర సరఫరాల అధికారి ఎం.వి.ప్రసాద్‌ పాల్గొన్నారు.అనంతరం మంత్రి పలు శాఖల అధికారులతో కలిసి కాకినాడలోని పోర్ట్‌ ఏరియా, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని బియ్యం గోదాములు, ఆగ్రో ఇండిస్టీలను తనిఖీ చేశారు. నమూనాలను సేకరించారు. తొలుత పోర్ట్‌ ఏరియాలో ఉన్న విశ్వప్రియ బియ్యం గోదాము, బీచ్‌ రోడ్డులోని సాటక్స్‌ ఇండియా రవీంద్ర బియ్యం గోదాము, మానస ఎక్స్‌ పోర్ట్‌, డిఎస్‌ఎన్‌ బియ్యం గోదాము, కరప మండలం నడకుదురులోని లావన్‌ ఇంటర్నేషనల్‌ బియ్యం గోదాము, చొల్లంగిలోని సరళ ఫుడ్స్‌, తాళ్ళరేవు మండలం యానాం రోడ్డు చొల్లంగిలోని విష్ణు పట్టాభిరామ ఫుడ్స్‌, ఆగ్రో ఇండిస్టీ, చొల్లంగి విశ్వగోదాము, తూరంగిలోని విఎస్‌.రాజు సన్స్‌లో నిల్వలను తనిఖీ చేశారు. పేద ప్రజలకు రేషన్‌ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని క్షేత్రస్థాయిలో రీసైక్లింగ్‌ చేసి అక్రమంగా విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీలు నిర్వహించిన పది ప్రాంతాల్లో ఏడు చోట్ల పిడిఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయన్నారు. వీరందరిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

➡️