బిజెపితో అంటకాగేవారిని సాగనంపండి

Feb 9,2024 23:15
బిజెపి

పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు
బిజెపితో అంటకాగేవారిని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండను నిర్వహించారు. అలాగే కాకినాడ జిల్లా తునిలో రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. చాగల్లులో జరిగిన రచ్చబండలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితుల సమస్యలు, చాగల్లు షుగర్‌ఫ్యాక్టరీ మూత వల్ల ఉపాధి కోల్పోయిన వారి సమస్యలను పలువురు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని పలువురు వాపోయారు. దళిత మహిళ హోం మంత్రిగా ఉన్నారని, ఆమె నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళిత నాయకుడు బొంత శ్యామ్‌ప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రవాణారంగ కుదేలైందని ఆ రంగ కార్మికులు ఆమె వద్ద సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఇద్దరు బిజెపికి తొత్తులుగా ఉన్నారన్నారు. వారి స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బిజెపి వద్ద తాకట్టు పెనట్టారన్నారు. బిజెపితో పొత్తు కోసం ఇరుపార్టీలు తహతహలాడుతున్నాయన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి పక్షాన చేరే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్టేనన్నారు.కొవ్వూరు ఎంఎల్‌ఎ తానేటి వనతి హోం మంత్రిగా ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారన్నారు. వైసిపి నాయకుల అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగాయన్నారు. హత్యలకూ వారు వెనకాడట్లేదన్నారు. ధరలను అదుపుచేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పావలా ఇచ్చి రూపాయి లాక్కుంటున్నారన్నారు. కుటుంబంలో ప్రతి బిడ్డకూ అమ్మ ఒడి అని చెప్పి ఒక బిడ్డకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేలు ఇస్తుందన్నారు. సర్కారు కల్తీ మద్యంతో సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. ఆర్‌బికెలున్నా రైతులకు మాత్రం భరోసా లేకుండా పోయిందన్నారు. టిడిపి హయాంలో 7 వేల పోస్టులతో డిఎస్‌సి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు. ఆ సమయంలో బాబు హేళన చేసిన జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చేసిందేమిటి? అని ప్రశ్నించారు. దగా డిఎస్‌సితో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చాగల్లులో షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి, ఐదేళ్లయినా నేటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు జగనన్నా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ వారసులు అంటే హామీలు ఇచ్చి మోసం చేయడమా? అని అన్నారు. ఇసుక, మద్యం, భూ కుంభకోణాల ద్వారా సంపాదించిన డబ్బును రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా పంచనుందన్నారు. డబ్బులు తీసుకున్నా… ఓటు మాత్రం ఆలోచించి వేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు కల్పన, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే వస్తాయనేది గుర్తు చేసుకోవాలన్నారు. మోసపూరిత ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటువేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మొదటి సంతకం ప్రత్యేకహోదా ఫైలుపైనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జెడి.శీలం, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, ఎ.అరుణకుమారి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.దివీస్‌ను ఏ బంగాళాఖాతంలో కలిపారు?దివీస్‌ పరిశ్రమను జగన్మోహన్‌రెడ్డి బంగాళాఖాతంలో కలుపుతానన్నారని, ప్రతిపక్షంలో ఉండగా ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిశ్రమకు దగ్గరుండి మరీ అనుమతులిచ్చారని విమర్శించారు. దివీస్‌ను ఏ బంగాళాఖాతంలో కలిపారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. తుని రోడ్‌షోలో పాల్గొన్న షర్మిల స్థానిక మంత్రి దాడిశెట్టి రాజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుకవ్యాపారంలో, గుట్కా వ్యాపారాలు చేస్తూ రాజా జేబులు నింపుకుటున్నారన్నారు. బయట మద్యాన్ని తెచ్చి రెట్టింపు రేట్లకు అమ్ముకుంటున్నారన్నారు. ఆయన పేరు దాడిశెట్టి రాజా కాదు అనుభవించు రాజా అంట కదా? అంటూ ఎద్దేవా చేశారు. బాబు అమరావతి పేర 3డి సినిమా చూపిస్తే జగన్‌ మూడు రాజధానుల పేర కాలయాపన చేశారన్నారు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బెజెపితో బాబు, జగన్‌లు దోస్తీ కడుతున్నారన్నారు. కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు రావాల్సి ఉందని, దీనిపై ఎంత నిధులు వచ్చాయో ప్రభుత్వ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

➡️