బిజెపి పాలనలో మహిళలపై దాడులు

Mar 9,2024 23:42
బిజెపి పాలనలో మహిళలపై దాడులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికేంద్రంలోని బిజెపి పాలనలో మహిళలపై మానసిక, శారీరక దాడులు పెరిగాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మనువాద ప్రమాదం-మహిళల ముందున్న రాజకీయ కర్తవ్యం అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఐద్వా సీనియర్‌ నాయకులు టి.సావిత్రి, అంగన్వాడీ హెల్పర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి అధ్యక్షత్న నిర్వహించిన ఈ సదస్సులో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాద భావజాలం విస్తరించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం అమలుకు నోచుకోవడం లేదన్నారు. చిన్నారి అసిఫాపై అత్యాచారం, బిల్కిస్‌ భానో, భారత రెజ్లర్లపై లైంగిక దాడులు ఇలా ప్రతి సంఘటనలోనూ బిజెపి నేతలు నిందితులకు అండగా ఉన్నారన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు అరుణకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలోఈ ఏడాది తీసుకున్న ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌ నినాదానికి దేశంలో, రాష్ట్రలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. పీజీ కోర్సులలో మూఢనమ్మకాలు ప్రబలేలా పాఠ్యాంశాలను చేర్చడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఐద్వా సీనియర్‌ నాయకులు టి.సావిత్రి మాట్లాడుతూ పోరాటాల ద్వారానే మహిళల హక్కులు రక్షించుకోగలమన్నారు. ప్రభుత్వ రంగంలోని స్కీము వర్కర్లకు పని భారం పెరిగిందని అన్నారు. కనీస వేతనాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. హక్కుల కోసం జరిగే పోరాటాలను అణగదొక్కేందుకు పాలకులు యత్నిస్తున్నారని తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి..రాజులోవ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి కె.వెంకట లక్ష్మి, మిడ్డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చిట్టా బేబీ, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎ.జరీనాషరీఫ్‌, సునీత, సుబ్బలక్ష్మి, మార్త, శారద, రామలక్ష్మి, యుటిఎఫ్‌ నాయకులు రాజేశ్వరి, అనిత, ఆశా యూనియన్‌ నాయకులు హవెల, వెంకట లక్ష్మి, నాగమణి పాల్గొన్నారు.

➡️