భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య

Feb 16,2024 00:02

ప్రజాశక్తి-కడియంప్రేమించి పెళ్లి చేసుకుని పదహారేళ్ల కాపురం చేసిన ఆ దంపతుల మధ్య అనుమానం పెనుభూతమయ్యింది. భార్యను కత్తితో గొంతు కోసి పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియపు సావరంలో గురువారం సంచలనం రేపింది. గ్రామానికి చెందిన దూళ్ల సత్యశ్రీ (35), సూర్యప్రకాష్‌ (38) 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యపై అనుమానంతో ఇటీవల మూడు నెలలుగా సూర్యప్రకాష్‌ గొడవ పడుతున్నాడు. పెద్దల సమక్షంలో వీరి మధ్య రాజీ కుదిర్చినా ప్రయోజనం లేకపోయింది. సూర్యప్రకాష్‌కు భార్యపై అనుమానం ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున సత్యశ్రీని భర్త సూర్యప్రకాష్‌ చాకుతో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు సమీప పొలాల్లోకి వెళ్లి పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో చేరాడు. స్థానికులు గమనించి అతడిని భార్య మృతదేహంతో పాటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కడియం సిఐ బి.తులసీధర్‌ తెలిపారు. సౌత్‌ జోన్‌ డిఎస్‌పి అంబికా ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

➡️