మంట పుట్టించిన మండపేట.!

Jan 27,2024 10:44
పవన్‌ కళ్యాణ్‌

సిట్టింగ్‌ ఎంఎల్‌ఎకు సీటు ప్రకటించిన చంద్రబాబు
రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నట్టు పవన్‌క్లారిటీ
పొత్తు ధర్మంపై రాజకీయ వర్గాల్లో చర్చ
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
‘నాకున్న ఒత్తిళ్లు నాకున్నాయి. వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తున్నాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది’ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ప్రకటించారు. దీనికి కారణం ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మండపేటలో ‘రా కదలి రా’ సభలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వర్రావును మూడోసారి గెలించాలి అంటూ చంద్రబాబు ప్రకటించారు. దీంతో పాటు అరకు సీటుని కూడా డిక్లేర్‌ చేశారు. దీంతో మిత్ర పక్షాల మధ్య మండపేట మంట పుట్టించినట్లు అయింది. గత ఎన్నికల్లో జనసేన తరుపున ఇక్కడ వేగుళ్ల లీలా కృష్ణ పోటీ చేయగా ఎక్కువ ఓట్లనే సాధించారు. ఈసారి కూడా ఆయనే టికెట్‌ ఆశిస్తున్నారు. ఈలోగా టిడిపి సిట్టింగ్‌ సీటు కాబట్టి చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీ శ్రేణులకు క్షమాపణ కూడా చెప్పారు. దీంతో పాటుగా ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన ఏకైక సీటు రాజోలు మాత్రమే. ఇక్కడ జనసేన సిట్టింగ్‌ సీటును ప్రకటించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ రాజానగరంలో మాత్రం ఆసక్తిగా మారింది. అక్కడ గడచిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు టిడిపి గెలిచింది. 2019లో మాత్రం ఓడిపోయింది. ఆ సీటును బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గత ఏడాదికాలంగా క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ సీటులో బొడ్డును కాదని జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో టిడిపి శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. అధినేతలు మాట్లాడుకొని ఉమ్మడిగా ముందుకు వెళ్లాల్సింది పోయి ఇలా బహిరంగంగా సీట్లను ప్రకటించడం వల్ల కింది స్థాయిలో ఇరు పార్టీల్లో సందిగ్ధత ఏర్పడింది. ఇది పొత్తుపై ప్రభావం పడేలా కనిపిస్తుంది. టిడిపి, జనసేన పొత్తుతో ముందుకు వెళితే ముఖ్యంగా గోదావరి జిల్లాలు అందులో తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందని తొలి నుంచీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మండపేట మంట పుట్టించడం దానికి కొనసాగింపుగా రాజోలు, రాజానగరం ఈ మంట రాజేయడంతో వీళ్ళ పొత్తులో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రెండు పార్టీల నాయకుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. క్షేత్రస్థాయిలో శ్రేణుల్ని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈ పొత్తులు ఏ మేరకు సాగుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.మూడు జిల్లాల పరిధిలో రాజోలుతో పాటు అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్‌, పిఠాపురం, జగ్గంపేట, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, పెద్దాపురం వంటి అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీ ముందు నుంచీ ఆశిస్తోంది. కానీ టిడిపికి కూడా వీటిలో అనేక స్థానాల్లో బలమైన నేతలు ఉన్నారు. ప్రధానంగా రాజమండ్రి రూరల్‌, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంఎలఎలకు ఆయా స్థానాలను కేటాయిస్తున్నట్టు టిడిపి అధినేత ప్రకటించారు. మెట్ట ప్రాంతంలో బలమైన నాయకుడు, టిడిపి సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ ఉండగా జగ్గంపేట సీటుని జనసేనకు కేటాయించే అవకాశం లేదు. మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ కచ్చితంగా పిఠాపురం నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసారు. కానీ బలమైన కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గం కాబట్టి జనసేన ఈ టిక్కెట్‌ ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పవన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం ఇక్కడ ఇన్చార్జిగా నియమించారు. ఆయన వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక వేళ పొత్తులో జనసేనకు కేటాయిస్తే స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని వర్మ తన అనుచరులతో ఇప్పటికే మాట్లాడుకుని ముందుకు వెళుతున్నారు. పోటీపై కేడర్‌కు స్పష్టతనిచ్చారు రెండు రోజుల క్రితం పిఠాపురం మండలం చిత్రాడలో జరిగిన జయహో బిసి కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు పాల్గొని పొరుగు ఊరి వారిని తరిమికొట్టి స్థానికుడైన వర్మకు ఓటేయాలని పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టిడిపి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సీట్లు కొన్నింటిపై ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదిరేలా కనిపించడం లేదు. ఒకరికొకరు సహకరించుకునే అవకాశం తక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️