మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషి

Feb 19,2024 22:39
మాదక ద్రవ్యాల

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు(ఎన్‌సిఒఆర్‌డి) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత పట్టిష్టం చేయాలన్నారు. ఇందులో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం వంటి వాటిని గుర్తించాల న్నారు. వాటి నియంత్రణ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు అధికారుల సమన్వయంతో వసతిగృహాలు, పాఠ శాలల్లో డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెంచాలన్నారు. డగ్‌ డిటెక్షన్‌ సెంటర్లు, అడిషనల్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. మత్తుకు బానిసలైనవారి నుంచి వివరాలను సేకరించాలన్నారు. ఎస్‌పి పి.జగదీష్‌ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు, వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వాణిజ్యేతర పరిమాణంకి సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ మరియు సైకోట్రోపిక్‌ పదార్థాలకు సంబందించి తప్పించుకుకుని తిరుగుతున్న ఇద్దరిని ఈ నెలలో అరెస్ట్‌ చేశామన్నారు. మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. నగర శివారు నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, సాధువులు ఉండే ప్రాంతాలు, నగరంలో ఇప్పటికే గుర్తించిన పలు ప్రాంతాల్లో పోలీసింగ్‌ను బలోపేతం చేశామన్నారు. ఆర్‌టిసి, రైల్వే పార్శిల్‌ ఆఫీసుల్లో పోలిస్‌, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ సమన్వయంతో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఇబి అధికారి పి.సోమశేఖర్‌, జిల్లా ఫారెస్ట్‌ అధికారి బి.నాగరాజు, డిఎస్‌పి ఎల్‌.మోహన్‌ రావు, సంక్షేమ శాఖ అధికారులు బి.రమేష్‌, ఎం.సందీప్‌, కెఎస్‌.జ్యోతి, డిఎస్‌పి ఎం.అంబికాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️