రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు జమ

Feb 28,2024 23:52
రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు జమ

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌పిఎం కిసాన్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పథకం, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు ఆర్థిక సాయం వర్చువల్‌గా రైతుల బ్యాంకు ఖాతాలకు బుధవారం జమ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాధవీలత, జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, రైతులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్థికంగా భరోసా అందిస్తోందని చెప్పారు. జిల్లాకు చెందిన రైతాంగానికి ఆర్థిక సాయం కింద పంట సాయం అందించడంతో పాటు, వారు తీసుకున్న బ్యాంకు రుణం కోసం చెల్లించిన వడ్డీ రాయితీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2021-22 రబీకి చెందిన 17,409 మంది రైతులకు రూ.3,40,08,955లు, 2022 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన 13,305 మంది రైతులకు రూ.2,45,61,019 వెరసి 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5,85,69,974ను సున్నా వడ్డీ రాయితీ మేర ప్రయోజనం పొందినట్లు కలెక్టర్‌ తెలిపారు. వరుసగా 5వ ఏడాది 3 విడతగా వైయస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలోని 14,1216 మంది రైతులకు రూ.28,39,04,000 వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌.మాధవరావు, అధికారులు, రైతులు కొత్తపల్లి కేశవ రామారావు, కురుమళ్ల ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️