2వ రోజుకు పెన్షనర్ల దీక్ష

Feb 6,2024 23:34
పింఛను

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

కనీస పింఛను రూ.9వేలు ఇవ్వాలని మోరంపూడి వద్ద ఉన్న ఇపిఎఫ్‌ కార్యాలయం వద్ద ఇపిఎఫ్‌ఒ 95 పెన్షనర్స్‌ చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి రెండోరోజుకు చేరాయి. ఈ నిరసన దీక్షలను ఉద్దేశించి అసోసియేషన్‌ నాయకులు సిహెచ్‌.మోహనరావు, సోమేశ్వరావు మాట్లాడారు. ధరలు పెరుగుతున్నా నేటికీ పింఛను పెంచకపోవడం దారుణమన్నారు. కనీస పింఛను రూ.9వేలు ఇవ్వాలని, భార్య, భర్తలకి వైద్య సదుపాయం కల్పించాలని, డిఎ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సినియర్‌ సిటీజన్స్‌కు రైల్వే ప్రయాణంలో రాయితీ కల్పించాలన్నారు. హయర్‌ పెన్షన్‌ అమలు చేయాలన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా తమ సమస్యలు పరిస్కారం కోసం దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి దీక్షలో హార్లిక్స్‌ ఫ్యాక్టరీ కార్మికులు మాదిరెడ్డి సత్యనారాయణ, ఎన్‌.వెంకటరావు, ఎన్‌.సత్యనారాయణ, పి.గంగ, పేపర్‌ మిల్లు నుంచి శంకరరావు, జిసిసి నుంచి ఎన్‌.వీరయ్య, ధర్మారావు, పండు దొర పాల్గొన్నారు. ఈ దీక్షలకు సిఐటియు జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్‌బాబు, జివి.నాగేశ్వరరావు, ఎన్‌వి.ఆనంద్‌, ఎన్‌.రామారావు, రామకృష్ణారెడ్డి, సుబ్బారావు, బాల రామరాజు, టిఎస్‌.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️