ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి

May 24,2024 14:30 #East Godavari

ఎమ్మార్పీఎస్ నేత జయరాజు 

ప్రజాశక్తి-కడియం (మండపేట) : ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు మాదిగ కోరారు. శుక్రవారం ఆయన మండపేట లో స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. గత మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రాష్ట్రమంతటా నిలిచిపోవడం వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఏ రకంగా ఉందో అర్థమౌతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి 25 లక్షలకు పెంచడం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వ మోసంగా పరిగణించాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసే అన్ని వైద్యశాలల యాజమాన్యం ప్రస్తుత పరిస్థితుల్లో సేవలు నిలిపివేయడం సబబు కాదన్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే బకాయిల సంగతి తేల్చుకోవాలని ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అన్ని ఆరోగ్య సేవలను పునరుద్ధరించి కొనసాగించాలని ఈ సందర్భంగా జయరాజు కోరారు.

➡️