కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

May 20,2024 22:14
కౌంటింగ్‌

ప్రజాశక్తి – రాజానగరం
నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. సోమవారం సాయంత్రం ఎస్‌పి పి.జగదీష్‌తో కలిసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దిశా నిర్దేశం చేశామన్నారు. మూడంచెల భద్రత నేపథ్యంలో చేపడుతున్న కార్యకలాపాలపై ఎస్‌పి జగదీష్‌తో కలిసి సమీక్షించామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద నిర్వహించే భద్రతా ఏర్పాట్లు, పోలీస్‌ ఫోర్సెస్‌ విధులపై చర్చించారు. అనంతరం విజిటింగ్‌ రిజిస్టర్‌లో సంతకం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి బ్యాలెట్‌ యూనిట్స్‌, ఇతర అనుబంధ పత్రాలు భద్రపరచిన గది నుంచి తీసుకుని రావాల్సిన రూట్‌ మ్యాప్‌పై చర్చించారు. సంబంధిత ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారులు జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ కలెక్టర్‌కు వివరించారు. వారి వెంట సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ్‌, ఆర్‌డిఒ చైత్ర వర్షిణి, అదనపు ఎస్‌పి ఎల్‌.చెంచిరెడ్డి తదితరులున్నారు.

➡️