కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Apr 25,2024 23:40

బ్రాహ్మణగూడెంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అరుణకుమారి ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం

జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన వివిధ పథకాలను ఓటర్లకు వివరించారు.చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం ఎస్‌సి పేటలోని ఇందిరా కాలనీ లో గురువారం కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అరిగెల అరుణ కుమారి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద మహిళా అకౌంట్‌లో రూ.8333 సాధారణ ఖర్చులకు వేస్తామని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రోజు కూలీలకు రూ.400 పెంచుతామని, అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని, పేద పిల్లలకు ఎల్‌కెజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యా అందిస్తామని అరుణ కుమారి ప్రచారం లో ఇంటింటికీ ప్రచారం చేశారు. కార్యక్రమంలో చాగల్లు మండలం అధ్యక్షులు బొనిగే రాంబాబు, పి సి సి డెలిగేట్‌ గెడ్డం సాయిబాబా, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు కొణిదల శ్రీనివాస్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పాలకుర్తి ప్రభాకర్‌ చౌదరి, జిల్లా సెక్రటరీ కొయ్య వెంకట్‌ రావు, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు అందె వెంకట నాగభూషణం, బిసి సెల్‌ నాయకులు సత్యనారాయణ మీసాల, మండలం ఎస్‌ సి సెల్‌ అధ్యక్షులు గుమ్మాపు జాన్‌ తదితరులు పాల్గొన్నారు. కడియం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్‌ మండలం లోని కడియపులంకలో గురువారంరాత్రి పర్యటించారు. ఇంటింటకీ తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివద్ధి కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని , పూల మార్కెట్లో ప్రతి ఒక్కరినీ కలిసి అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉలిసెట్టి సత్తిబాబు, కె.టి. రామారావు, బండారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

 

➡️