‘తూర్పు’లో పోలింగ్‌ ప్రశాంతం

May 13,2024 23:36

ప్రజాశక్తి-యంత్రాంగం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌: సోమవారం ఉదయం కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని కలెక్టరు పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కంబాల పేట చున్నీ లాల్‌ జాజు రోటరీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ హై స్కూల్‌ నందు తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ సిబ్బంది మాక్‌ పోల్‌ నిర్వహించారన్నారు. ఉదయం 7 గంటల నుంచి రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభించారన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నూరు శాతం వెబ్‌ క్యాస్టింగ్‌ కొరకు కెమెరాలను పోలింగ్‌ కేంద్రాలు లోపల, బయట కూడా ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారని అన్నారు. ఉదయం 5 గంటల నుంచి కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షణా చేస్తున్నా మన్నారు. జిల్లా ఎస్‌పి, ఇతర ఇబ్బంది సమన్వయంతో పోలింగ్‌ సజావుగా పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని సజావుగా పోలింగ్‌ ప్రక్రియ జరగుతున్నట్లు తెలిపారు. వేసవిని దష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లో తాగునీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టరు తెలిపారు. ఈసారి ఓటింగు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాజానగరం: నియోజకవర్గంలో 2,16,491 ఓట్లు ఉన్నాయి. చిన్న చిన్న సంఘటలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రారంభం నుండి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరారు. ఉదయం 7 గంగల నుండి 9 గంటలకు 7.81 శాతం 16,916 మంది. 9 గంటల నుండి 11 గంటలకు 22.91 శాతం 49,592 ఓట్ల, 11గంటల ఒంటిగంట వరకు 33.64 శాతం 72,837 ఓట్లు, ఒంటిగంట నుండి 3 గంటల వరకు 54.16 శాతం 1,17,260 ఓట్ల, 3 గంటల నుండి 5 గంటల వరకు 68.71 శాతం 1,48,750 ఓట్ల పోలైనాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత రాజానగరం, కలవచల్ల, దివాన్‌ చెరువు గ్రామంలో కొనసాగింది. దీనిలో వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా రాజానగరం సమీపంలో సూర్యారావు పేట 194 పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకష్ణ కోరుకొండ మండలం గాదారాడలో ఓటు వేశారు. చాగల్లు: చాగల్లు మండలంలో 13 గ్రామాల్లో 50 పోలింగ్‌ బూతుల్లో ఉదయం 7 గంటల నుండి జనం బారులు తీరారు. చాగల్లు 118 బూత్‌లో ఇవిఎం ఇబ్బంది పెట్టడంతో సుమారు 45 నిమిషాల వరకు ఓటర్స్‌ ఇబ్బంది పడ్డారు. స్థానిక పంచాయతీ ఎన్నికల కన్నా జనరల్‌ ఎన్నికలకు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు నుంచి ఈ ఎన్నికల్లో ఓటు వేయడం స్థానికులు చర్చించుకుంటున్నారు. మండలంలో మార్కొండపాడు, బ్రాహ్మణగూడెం, కలవలపల్లి, చిక్కాల గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి సెంట్రల్‌ పోస్ట్‌ నుండి నలుగురు చొప్పున ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ పి.నాగరాజు తెలిపారు. చాగల్లు మండలంలో ఉదయం 9 గంటలకు 10.49 శాతం, 11 గంటలకు 24.62 మధ్యాహ్నం ఒంటిగంటకు 40.77 శాతం మూడు గంటలకు 55.89 శాతం ఓటింగ్‌ జరిగినట్లు తహశీల్దార్‌ ఎం.సావిత్రి తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఎన్నికలు పాల్గొనొచ్చని తహశీల్దార్‌ తెలిపారు. ఉండ్రాజవరం: సార్వత్రిక ఎన్నికలలో చివరి ఘట్టం పోలింగ్‌, ఓటింగ్‌ సోమవారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 5.30 గంటలకు అధికారుల నమూనా ఓటింగ్‌ అనంతరం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. అనేకచోట్ల 6 గంటల నుండే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా బారులు తీరారు. అయితే కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించడంతో ఉదయం పూట ఓటింగ్‌ నెమ్మదిగా సాగింది. ప్రభుత్వం షామియానాలు, మంచినీళ్లు ఏర్పాటు చేయడంతో ఓటర్లు లైనుల్లోఉండి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసే సమయం సాయంత్రం ఆరు గంటల వరకు నియోజకవర్గంలో 70 నుండి80 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సమయం ముగిసిన అనంతరం క్యూ లైన్‌ లో వేచి ఉన్న ఓటర్లను లోనికి అనుమతించి గేట్లు మూసివేశారు. మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం లేకుండా, చిన్నపాటి ఘర్షణలతో పోలింగ్‌ ముగిసింది. నల్లజర్ల: మండలంలో 24 గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా సోమవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కూటమి బలపరిచిన గోపాలపురం తెలుగుదేశం అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు. తన ఓటును ప్రకాష్‌ రావు పాలెం హై స్కూల్‌ నందు వినియోగించుకున్నారు. మండలంలోని, 24 గ్రామాల్లో 66 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా. రాత్రి 9:30 గంటల వరకు పోలైన ఓట్లు 79 శాతం, ఉందని అధికారులు తెలిపారు.

➡️