విద్య, మనోవికాసానికి ప్రాధాన్యత

May 22,2024 17:23 #vesavi sibiram

మానికొండ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరానికి పెరుగుతున్న ఆదరణ
ప్రజాశక్తి-గన్నవరం
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థకు అనుబంధంగా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని బ్రాంచి గ్రంథాలయం ఎంతో ఆదర్శప్రాయంగా నడపబడుతోంది. ఏటేటా నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల్లో ఏడురోజులపాటు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠకుల మన్ననలు పొందుతోంది. తాజాగా పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా ప్రత్యేకంగా వేసవి విజ్ఞాన తరగతులు ఈ గ్రంథాలయంలో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఇక్కడకు వచ్చి గ్రంథాలయంలో జరిగే ప్రత్యేక తరగతుల్లో ఉత్సాహంగా పాల్గంటున్నారు. శిక్షణా తరగతులతోపాటు ఇక్కడ అందుబాటులో వివిధ రకాల పుస్తకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి దాక అందరికీ అవసరమైన ఎన్నో విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సైన్స్‌, ఇంజనీరింగ్‌, సాహిత్యం, ఆర్థిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యక్తి అయిన ప్రవేశించి వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు. జ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా పిల్లలు, పెద్దలు, యువత అందరూ వచ్చి మానికొండ గ్రంథాలయంలోని పుస్తకాలను చదవటం ద్వారా తమకు తెలియని ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలకి కూడా కథల పుస్తకాలు, కవితలు, బమ్మలు పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వేసవి తరగతులు పూర్తయిన తర్వాత పిల్లలు ఆయా పుస్తకాలను సరదాగా చదువుకుంటున్నారు. పెద్దలకు ప్రతిరోజూ వివిధ దినపత్రికలకు సంబంధించిన పేపర్లు అందుబాటులో ఉన్నాయి. కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మానికొండ బ్రాంచి గ్రంథాలయ అధికారి ఎల్‌.హరికృష్ణ ఎంతో ఓపిగ్గా పాఠకులు, సందర్శకులు, విద్యార్థినీ విద్యార్థులకు సహకరిస్తున్నారు. వారికి అవసరమైన పుస్తకాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
వేసవి శిక్షణా శిబిరానికి ఉత్సాహంగా విద్యార్థులు
మానికొండ గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం గత వారం రోజులుగా చాలా ఉత్సాహ పూరితవాతావరణంలో కొనసాగుతోంది. విద్యార్థులు తాము చదివిన కథలను చెప్పటం, వినటం ద్వారా వాటిలోని సారాంశాన్ని తెలుసుకుంటున్నారు. చెప్పటం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతోంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషలో వాక్యాలు రాయటంలో కూడా విద్యార్థులు ఆసక్తిగా పాల్గంటున్నారు. వివిధ రకాల పోటీల్లో పాల్గని కొందరు బహుమతులను సైతం అందుకుంటున్నారు.
విద్యార్థులు ఆసక్తిగా పాల్గంటున్నారు
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మానికొండ బ్రాంచి గ్రంథాలయ అధికారి ఎల్‌.హరికృష్ణ
మా గ్రంథాలయం ద్వారా ఏటేటా వేసవిలో విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నాం. విద్యార్థినీ విద్యార్థులు గత వారంరోజులుగా ఉత్సాహ పూరిత వాతావరణంలో పాల్గంటున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అంశంపై వారికి తెలియని విషయాలను చెబుతుండటం పట్ల వారు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఆటలు, పాటలు, పద్యాలు, కథలు చెప్పటం, స్పెల్లింగ్‌లు చెప్పించటం, చేతిరాత ఇలా అనేక రకాలుగా మేము నిర్వహిస్తున్న పోటీల్లో కూడా విద్యార్థినీ విద్యార్థులు చురుగ్గా పాల్గంటున్నారు. ఉపన్యాసం చెప్పటం, తెలుగు, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం, గణితంలో పోటీలు, తెలుగులో పద్యాలు, హిందీ, ఇంగ్లీషులో అంకెలు, పద్యాలు వంటివి విద్యార్థులకు చెప్పటం, వారితో చెప్పించే పక్రియ జరుగుతోంది. జాతీయ నాయకుల జీవితాలను తెలిపే అంశాలను చదివించటం కూడా చేయిస్తున్నాం. తద్వారా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ విద్యార్థులను పంపుతున్నారు. మా వంతుగా వారికి కొత్త అంశాలు నేర్పటం, ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గనేలా కృషి చేయిస్తున్నాం. పుస్తకాలు చదివించటం వల్ల పిల్లల్లో మేథో వికాసం పెరుగుతుంది. గ్రంథాలయాల్లో అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థినీ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో సెల్‌ఫోన్‌కు అలవాటుగా మారుతున్న క్రమంలో కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణకు రావటం ఎంతో ముదావహం. మనోవికాసం పెంపొందించే చదరంగం, క్యారమ్‌, లూదో వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేశాం.

➡️