శ్రీరామ్మూర్తి ఆశయ సాధనకు కృషి

May 3,2024 21:33

ప్రజాశక్తి – కొమరాడ: మన్యం జిల్లాలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన రెడ్డి శ్రీరామ్మూర్తి ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని దేవకోన పంచాయతీ అంటివలస, పెదశాఖలో శుక్రవారం రెడ్డి శ్రీరామ్మూర్తి తృతీయ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం సాంబమూర్తి, ఎపి గిరిజన సంఘం నాయకులు సన్యాసిరావు, గంగరాజు మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి అతి చిన్న వయసులోనే కమ్యూనిస్టు భావజాలంతో ఉద్యమ దశ వైపు వచ్చి రైతాంగ, వ్యవసాయ కూలీలు, పేదలు తదితరుల సమస్యలపై ఎనలేని సేవ చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితుల సమస్య పరిష్కారం లోనూ, గిరిజన హక్కుల కోసం పోరాటం చేయడంలో ఆయన కృషి మరవరానిదని కొనియాడారు. కావున ఆయన ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ సమస్యల పైన పోరాటానికి ముందుకు రావాలని, ఇలాంటి పోరాటాల స్ఫూర్తితోనే శ్రీరామ్మూర్తికి ఇచ్చిన ఘన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బోడియ పార్వతి, లక్ష్మి, ప్రసాద్‌, శేఖరు, మధు, కైలాస్‌, సుబ్బారావు, రమేష్‌, సుబ్బారావు, రామస్వామి పాల్గొన్నారు. అనంతరం మండలంలోని అంటివలస, పేద శాఖ, చీసాడవలస గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరకు పార్లమెంటుకు, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు పి.అప్పలనర్స, మండంగి రమణకు సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. అలాగే శనివారం కొమరాడలో సిపిఎం ఆధ్వర్యాన బహిరంగసభ జరుగుతుందని, ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరు కానున్నారని, దీనికి ప్రజలంతా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మధు, కైలాస్‌, రమేష్‌, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

➡️