‘అంబేద్కర్‌ ప్రపంచ జ్ఞాని’

ఐడియా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ గొళ్లమూడి రాజసుందర్‌ బాబు

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

డాక్టర్‌ అంబేద్కర్‌ గ్రంథాలయాలని ఆధారం చేసుకునే ప్రపంచ జ్ఞాని కాగలిగాడని, లండన్‌ లైబ్రరీలోని లక్షలాది పుస్తకాలను చదివిన ప్రపంచ మేధావులు వంద మందిలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ మొదటి వాడని ఐడియా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ గొళ్లమూడి రాజసుందర్‌ బాబు పేర్కొన్నారు. ఎపి పంచాయతీ రాజ్‌ మినిస్ట్రీయల్‌ భవనంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయ సంస్థల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో డాక్టర్‌ గొల్లమూడి రాజా సుందర్‌ బాబు మాట్లాడారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ వాళ్లు 2012లో సర్వే చేసారని, అందులో లండన్‌ లైబ్రరీలోని లక్షలాది పుస్తకాలను చదివిన ప్రపంచ మేధావులు వంద మందిలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ మొదటి వాడని గుర్తించడం జరిగిందన్నారు. కావున రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద లైబ్రరీ స్థాయిని, వినియోగాన్ని పెంపొందించే పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రంధాలయ ఉద్యోగుల సమస్యలపై జి.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి బాబ్జి, సహాయ కార్యదర్శి ఆలీలు వివరించగా, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌ బాబు ప్రస్తావించిన సమస్యలపై స్పందించి మాట్లాడారు. ఎపి జెఎసి అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌.హరినాథ్‌, ఎపి ఎన్‌జిఒ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి నేరుసు రామారావు తదితరులు ప్రసంగించారు. తదనంతరం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి రూపకల్పన చేసిన డాక్టర్‌ రాజసుందర్‌ బాబుని, ఎన్‌జిఒ సంఘ నాయకులు, గ్రంథాలయ ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు, గరగపర్రు బాధిత కమిటీ నాయకులు ఘనంగా సత్కరించారు. సభలో పాల్గొన్న ఎన్‌జిఒ సంఘం నాయకుల్ని గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సత్కరించి మెమొంటోళ్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ జుల్ఫికర్‌ అలీ పాల్గొన్నారు.

➡️