జిల్లాలో పలు చోట్ల వర్షం

ప్రజాశక్తి – ముదినేపల్లి
మండల కేంద్రమైన ముదినేపల్లి పరిసర గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలకుపైగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాలు, గ్రామాల్లోని అంతర్గత రోడ్లు జలమయయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షంతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు జలమయం అయ్యాయి. మండలంలోని వడాలి – చిగురుకోట రోడ్డు, గుడ్లవల్లేరు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రోడ్డు కనబడక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రెండు గంటపాటు కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ రైతులు చేల్లో నేరుగా విత్తనాలను వెదజల్లారు. ఈ వర్షంతో ఖరీఫ్‌ సాగు పనులు మరింత ముమ్మరంగా సాగనున్నాయి.కలిదిండి : బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది. బస్టాండ్‌ సమీపంలో రాష్ట్రీయ రహదారిపై వర్షపు నీరు చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహన దారులు పలు ఇబ్బందులు పడ్డారు. మండలంలో 90 శాతానికి పైగా ఉన్న చేపల, రొయ్యల చెరువులకు కొంతవరకైనా మేలే జరిగిందని పలువురు ఆక్వా రైతులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో వర్షం పడడంతో వల్ల ఆక్వా రైతాంగానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఉండి:బుధవారం తెల్ల వారుజాము నుంచి మండలంలో భారీ వర్షం పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఆర్‌ఒబి ప్రాంతంలో గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారిపైకి డ్రెయినేజీ నీరు ప్రవహించడంతో విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో తెల్లవారుజాము నుంచే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. నరసాపురం : జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పెనుమంట్ర 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలో 48.8, వీరవాసరం 47.2, పాలకోడేరులో 40.4, పాలకొల్లులో 38.4, పోడూరులో 20.6, ఆకివీడులో 19.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకివీడు : మండలంలో ఎట్టకేలకు బుధవారం ఉదయం వర్షం పడింది. సుమారు రెండు గంటల పాటు వర్షం పడింది. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు. పెనుమంట్ర : బుధవారం తెల్లవారుజాము నుంచి మండలంలో ఏకధాటిగా వర్షం పడింది. పెనుమంట్ర మండలంలో ఏకంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెనుమంట్ర పరిసర గ్రామాల్లో ఈదురు గాలులు వీశాయి. వర్షం పడడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు.పాలకొల్లు : పాలకొల్లులో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం పడింది. నాలుగు రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలు మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. ఈదురుగాలులకు భగ్గేశ్వరంలో చెట్టుకొమ్మలు రోడ్డుపై పడడంతో పాలకొల్లు – భీమవరం మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది వెంటనే చెట్టు కొమ్మలు కత్తిరించి తొలగించడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యింది.పిడుగు పడి విద్యుత్‌ ఉపకరణాలు దగ్ధంమొగల్తూరు : ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బుధవారం తెల్లవారుజామున కురిసింది. వాతావరణంలోని మార్పులు ఒక్కసారిగా మారడంతో ప్రజలు ఆందోళన చెందారు.మొగల్తూరు పంచాయతీ పరిధి అగ్రహారంలో పిడుగు పడటంతో ఆప్రాంతంలోని నివాసాలలోని ఉండే ఫ్రిజ్లు, టీవీలు, ఫ్యానులు తదితర విద్యుత్‌ ఉపకరణాలు కాలిపోయాయ. దీంతో లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆచంట : బుధవారం మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక పక్క ఎండ మరో పక్క వర్షం పడుతూ వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈ వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దమ్ములు చేసుకునే పనిలో నిమగమయ్యారు.

➡️