ఆనందంగా పండుగ జరుపుకోవాలి : తహశీల్దార్‌

డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో చెస్‌ టోర్నమెంటు ప్రారంభం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా యువత చెడు వ్యసనాల వైపు మరలకుండా తెలుగు సంస్కృతి కాపాడే విధంగా అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఏలూరు తహశీల్దార్‌ పి.సోమశేఖర్‌ పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరు సిపిఎం కార్యాలయంలో జిల్లా ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.ఠాగూర్‌ రాజా అధ్యక్షత వహించగా తహశీల్దార్‌ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈవిధంగా ఆటల పోటీలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి కృషి, పట్టుదలకు అభినందనలు తెలిపారు. యువత, ప్రజానీకం అందరూ సంక్రాంతి సందర్భంగా జూద క్రీడల వైపు మరలకుండా ఇటువంటి ఆటపాటలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి మాట్లాడుతూ కొందరు రాజకీయ ప్రతినిధులు సంక్రాంతి అంటే కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా యువత చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జిల్లా కార్యదర్శి లెనిన్‌ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, పేకాట, జూద క్రీడలను అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సిఐటియు నాయకులు కిషోర్‌, చెస్‌ కోచ్‌లు డి.లక్ష్మణరావు, కృష్ణవేణి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన చెస్‌ క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొన్నారు.

➡️