ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – టి.నరసాపురం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఆశా వర్కర్లు కొద్ది నెలలుగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని యూనియన్‌ జిల్లా నాయకురాలు కె.పోసమ్మ డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్‌ఎన్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిని సోమవారం మండల నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్‌ ఆఫీసర్లు ఆశా డే పేరుతో సంబంధం లేని పనులు చేయిస్తున్నారని ఉదయం, సాయంత్రం, హెల్త్‌ సెంటర్స్‌కి వెళ్లి అటిండెనెట్స్‌ వేయాలని, పిఎంఎంవివై దరఖాస్తులు ఆశాలే రాయాలని వేధిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని రికార్డ్‌ పేరుతో, ఆన్‌లైన్‌ పనుల పేరుతో ఇబ్బంది పెడుతూ, చెప్పిన పని చేయకపోతే ఆశా ఇన్సెంటివ్‌ రిపోర్ట్స్‌పై సంతకం చేయమని బెదిరిస్తున్నారని వాపోయారు. హై రిస్క్‌ కేసులకు, టుబెక్టమి కేసులకు వైద్యులు రావడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిని ఇచ్చిన వారిలో ఆశా వర్కర్లు విజయలక్ష్మి, వనిత, లక్ష్మి, జ్యోతి, దేవమాత పాల్గొన్నారు.

➡️