ఎయు, ద్రావిడ వర్సిటీల విసిలు రాజీనామా

Jun 28,2024 23:56 #AU, #Dravida Universities, #resign, #VCs

– బాధ్యతల నుంచి వైదొలిగిన ఎయు రిజిస్ట్రార్‌
ప్రజాశక్తి – యంత్రాంగం :ఆంధ్రా యూనివర్సిటీ విసి, రిజిస్ట్రార్‌, ద్రావిడ వర్సిటీ విసిలు శుక్రవారం తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ మేరకు వారి రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతిగా పివిజిడి.ప్రసాద్‌ రెడ్డి 2020లో బాధ్యతలు చేపట్టారు. 2023లో ఆయన పదవీకాలం ముగిసినా రెండోసారి ఆయన్నే మరలా నియమించారు. దీంతో ఈ ఏడాది జనవరి 17న బాధ్యతలు చేపట్టారు. మరో రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను ఆయన దెబ్బతీశారని విద్యార్థి సంఘాలు, ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ కమిటీ 13 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న నేపథ్యంలో విసి రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఆచార్య వి.కృష్ణమోహన్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జేమ్స్‌ స్టీఫెన్‌ కూడా గురువారం సాయంత్రం తన అదనపు బాధ్యతల నుండి వైదొలిగారు. ఆయన స్థానంలో ఎయు అకడమిక్‌ డీన్‌ ఆచార్య ఎన్‌.కిషోర్‌బాబుకు రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చిత్తూరులోని ద్రావిడ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాక అన్ని వర్సిటీల విసిలు, రిజిస్ట్రార్లు రాజీనామాలు చేస్తున్న క్రమంలో మధుజ్యోతి కూడా తన పదవీ నుంచి తప్పుకున్నారు.

➡️