ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయాలి

భూ నిర్వాసిత రైతుల సమావేశం డిమాండ్‌

చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం చింతలపూడిలోని గురుభట్ల గూడెం రోడ్డులోని చిట్లూరి అంజిబాబు ఇంటి వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల సమావేశం నిర్వహించారు. న్యాయమైన పరిహారం కోసం ఉద్యమం చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిన 5 సంవత్సరాల లోపు భూసేకరణ భూముల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఆ భూములు తిరిగి రైతులకు అప్పగించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ సేకరణ కోసం 2015, 2016లలో నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఏడేళ్లు కావస్తున్నా రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. కాబట్టి ఆ నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రయివేట్‌ మార్కెట్‌ విలువ ప్రకారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం తరహాలో రైతులకు పరిహారం చెల్లించి, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత టిడిపి ప్రభుత్వ కాలంలో రైతులు న్యాయమైన పరిహారం కోసం ఉద్యమం చేయగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి గడిచిన 5 సంవత్సరాల కాలంలో కనీసంగా కూడా పట్టించుకోలేదన్నారు. రైతుల భూములను రెవెన్యూ రికార్డుల్లో బ్లాక్‌ లిస్టులో పెట్టివేయడంతో కుటుంబ అవసరాల రీత్యా అమ్ముకోలేక, ఇటు ప్రభుత్వ పథకాలు, పంట రుణాలను పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ అధ్యక్షులు ఖాదర్‌ బాబు రెడ్డి, చిట్లూరి అంజి బాబు, గోలి రామకృష్ణారెడ్డి, చిలుకూరి శ్రీహరి రెడ్డి, వనమాల రాంబాబు, కొనకళ్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️