ఎన్నికల్లో టిడిపి, జనసేన గెలుపు తథ్యం..!

జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు

ప్రజాశక్తి – చింతలపూడి

2024 ఎన్నికల్లో జనసేన, టిడిపిల పొత్తులో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో టికెట్‌ ఏ అభ్యర్థికి ఇచ్చినా గెలుపు తథ్యమని జనసేన మండల అధ్యక్షులు చీదారాల మధుబాబు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానంతో జనసేనలో చేరి, కొద్దికాలంలోనే జనసేన మండల అధ్యక్షులుగా ఎదిగి, గ్రామ గ్రామాలలో జనసేనని బలోపేతం చేశారు. వయసు చిన్నదైనా, చింతలపూడిలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన భాగంగా పూర్తి బాధ్యతలు తన భుజస్కంధంపైన వేసుకుని, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ మేకా ఈశ్వరయ్యతో కలిసి దిగ్విజయంగా చేసి ఔరా అనిపించారు. గ్రామీణ జన సైనికుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు తన వైపు చూసే విధంగా చేసుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లక్షల్లో జీతం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని అంటున్న జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధుబాబుతో ప్రజాశక్తి చిట్‌ చాట్‌జనసేనలోకి రావడానికి గల కారణం ఏమిటి?చిన్నతనం నుంచి మా కుటుంబానికి పవన్‌ కళ్యాణ్‌ మీద ప్రత్యేక అభిమానం ఉంది. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ స్ఫూర్తి, పోరాట పటిమతోనే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ స్థాపించారు. సినిమాలు తీస్తే కోట్లు వస్తాయి.. విలాసంతమైన జీవితం వదులుకొని ప్రజాసేవకు ముందుకు రావడం, మాలాంటి యువతని ఆలోచింపజేసింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నా జనసేనతో ముందుకు నడవాలని.. జనసేన లక్ష్యం బడుగు, బలహీన వర్గాల ఎదుగుదల. నా వంతుగా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలలోకి వచ్చాను.ఎన్నికల నాటికి జనసేనని ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు?ప్రతి గ్రామ, పంచాయతీ, మండల స్థాయిలో కమిటీలను పూర్తి చేశాం. అన్ని సామజిక వర్గాలను జనసేన కమిటీలో స్థానం కల్పించాం. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ప్రాధాన్యత కల్పించాం. పవన్‌ కళ్యాణ్‌ పార్టీని స్థాపించి ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలనుకుంటున్నారో, దానిపైన విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాం. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ తమ గ్రామాలలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు ప్రభావం ఏ విధంగా ఉంటుంది?ఎన్నికల్లో జనసేన, టిడిపి పొత్తు బలంగా కనిపిస్తుంది. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. చిన్న, చిన్న మనస్పర్థలు వచ్చినా వాటిని అధిగమించి 2024లో జనసేన, టిడిపి పొత్తు అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేస్తాం. 2024 ఎన్నికల్లో వైసిపిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ స్థాయిలో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి.చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి పొత్తు అభ్యర్థిగా టిడిపికి ఇస్తారా? జనసేనకి ఇస్తారా?ఏ పార్టీ అభ్యర్థికి ఇచ్చినా కష్టపడి పనిచేసి గెలిపించుకుంటాం. చింతలపూడి నియోజకవర్గంలో కాపు సామాజిక ఓటింగ్‌ సుమారు 60 వేల వరకు ఉంది. జనసేన అభ్యర్థికి టికెట్‌ ఇస్తే కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకి సపోర్ట్‌ చేస్తుంది. ఎస్‌సి, కాపు సామజిక వర్గాల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. టిడిపి అభ్యర్థికి ఇచ్చినా అదే రకంగా కష్టపడి గెలిపించుకుంటాం. ఏదైనా ఇక్కడ లక్ష్యం వైసిపిని ఓడించడమే.మండలంలోని సమస్యలను ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకువెళ్తారు?చింతలపూడి మండలంలో ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రెయినేజీలు. చింతలపూడి నగర పంచాయతీలో సెంట్రింగ్‌ లైటింగ్‌, చింతలపూడి ఎత్తిపోతల రైతులకు నష్టపరిహారం, 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన నామవరం-సీతానగరం రోడ్డుపై ప్రత్యేక ప్రణాళికలతో ప్రజల వద్దకు సమస్యలను తీసుకువెళ్తాం. నామవరం-సీతానగరం రోడ్డుపై పాదయాత్ర కూడా నిర్వహించాం. చింతలపూడి రోడ్లపై పోరాటాలు చేశాం. ఇప్పుడు టిడిపితో కలిసి సమస్యలపై పోరాడుతాం. ప్రజల వద్దకు తీసుకువెళ్తాం. 2019 నుంచి ఇప్పటివరకు చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు వేయలేదు. చింతలపూడి ఎత్తిపోతల రైతులకు నష్టపరిహారం కల్పించే విధంగా కృషి చేస్తాం.ఎన్నికల్లో టిడిపి గెలిస్తే.. ప్రాధాన్యత ఇస్తారా? ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి?గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పొత్తు సుదీర్ఘంగా ఉండే విధంగా రెండు పార్టీల అధిష్టానాల నాయకులు, కార్యకర్తల గురించి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు. ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా మా అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.వైసిపిని సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేస్తున్నారు, దీని ప్రభావం ఉంటుందా?ప్రజల వద్ద పన్నుల రూపంలో నగదు వసూలు చేసి, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలకు అభివృద్ధి చేయకుండా, కనీస రోడ్లు కూడా వేయకుండా, ఓట్లు వేయరు. ప్రజలు వైసిపిని నమ్మే ఆలోచనలో లేరు.

➡️