‘విద్యాకానుక’ బూట్లు వీధుల్లో విక్రయాలు

Jun 24,2024 21:31

‘విద్యాకానుక’ బూట్లను ఆటోలో వీధుల్లో విక్రయిస్తున్న వ్యాపారులు

                 హిందూపురం : ప్రభుత్వం విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సరఫరా చేసిన బూట్లు వీధుల్లో విక్రయిస్తున్నారు. ఇవి పట్టణంలోని ఎంజిఎం పాఠశాలకు సరఫరా చేసిన విద్యాకానుక కిట్లలోని బూట్లు అని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం గత ప్రభుత్వం సాక్స్‌ నుంచి షూలు, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా సామాగ్రి మొత్తం విద్యా కానుక పేరుతో ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా చేసింది. అందులో భాగంగానే పట్టణంలోని ఎంజిఎం పాఠశాలకు కూడా సరఫరా చేసింది. అయితే అప్పటికే మధ్యాహ్న భోజనం బిల్లులను అడ్డంగా దోచుకోవడానికి అలవాటు పడిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపిస్తూ వచ్చారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడు విద్యా కానుక కిట్లను గత ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిలో పాఠశాల హెచ్‌ఎం విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదని సమాచారం. దీంతో పాటు మధ్యహ్న భోజన పథకంలో అడ్డంగా దిగమింగడం కోసం విద్యార్థుల సంఖ్యను మరింత పెంచి చూపించడంతో ఆ సంఖ్యకు అనుగుణంగా విద్యా కానుక కిట్లు ఎంజీఎం పాఠశాలకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యాయి. దీంతో విద్యాకానుక కిట్లు పాఠశాలకు ఎక్కువగా వచ్చాయి. మార్చి నెల 22వ తేదీన పాఠశాలలో మిగిలి ఉన్న విద్యా కానుక కిట్లతో పాటు పాఠశాలలో ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కంప్యూటర్‌ డెస్క్‌ టాప్‌ లు, కీ బోర్డు, సిపియు, ఇతర పరికరాలను పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులకు కనీసం సమాచారం ఇవ్వకుండా హెచ్‌ఎం గుజరీ వ్యాపారికి అడ్డంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన డబ్బులను పాఠశాల ఖాతాలోకి జమ చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు జమ చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇలా అడ్డంగా అమ్మేసిన విద్యా కానుక కిట్లలోని బూట్లను కొంతమంది ఆటోలో వేసుకుని పట్టణంలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కేవలం జత బూట్లు రూ 50లు అని చెబుతూ విక్రయిస్తున్నారు. ఎంజిఎం పాఠశాలకు వచ్చిన విద్యా కానుక కిట్లు ఎన్ని, ఇందులో విద్యార్థులకు అందించిన కిట్లు ఎన్నిఅన్న అంశంపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే అవినీతి బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు నాడు నేడు, పూర్వ విద్యార్థుల సమైక్య ఆధ్వర్యంలో అందించిన నిధుల పైనా అధికారులు విచారణ చేస్తే లక్షలాది రూపాయల అవినీతి బయటపడే అవకాశాలు ఉన్నాయి.

➡️