చెక్‌పోస్టుల బలోపేతానికి చర్యలు

Mar 21,2024 22:46

ఎస్‌పి మేరీ ప్రశాంతి
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల బలోపేతం చేసేందుకు అంతర్రాష్ట్రాల పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామని ఎస్‌పి మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దు భద్రతను పెంచే దృష్ట్యా తెలంగాణ సరిహద్దు పోలీస్‌ సిబ్బందితో ఎస్‌పి మేరీ ప్రశాంతి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్తగూడెం చెక్‌పోస్ట్‌ డిఎస్‌పిలు, ఎస్‌ఐలు, సిఐలతో ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామని ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి స్వరూపరాణి, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పి నక్క సూర్యచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించాలిఎన్నికల నియమావళి నిబంధనలు పాటించాలని ఎస్‌పి మేరీ ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. ప్రచార కార్యక్రమాలు, రోడ్డుషోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడం, మైక్‌సెట్‌లలో ప్రచారం చేయడం వంటి వాటన్నిటికీ ముందస్తు అనుమతి తప్పనిసరని చెప్పారు. అనుమతులు ఎన్నికల కమిషన్‌ ఏర్పాటుచేసిన సువిధ యాప్‌ నుంచి తీసుకోవాలని తెలిపారు. ఒక గ్రామంలో రెండు పార్టీలకు సంబంధించిన ర్యాలీలు, సభలు నిర్వహించడానికి ఒకే సమయంలో ఒకేరోజు అనుమతి ఇవ్వడం జరగదని చెప్పారు. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థల వద్ద ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతులు లేవని, కుల, మత వైశ్యాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలకు ఎటువంటి అను మతులు ఉండవని తెలిపారు. ప్రతిఒక్కరూ అను మతులు పొంది శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా పోలీసు శాఖకు సహకరించాలని ఎస్‌పి కోరారు.

➡️