దేశానికే తలమానికంగా అంబేద్కర్‌ విగ్రహం

125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవానికి కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా మానవతా వాదులంతా హాజరై విజయవంతం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. శనివారం ఏలూరు విచ్చేసిన విక్టర్‌ ప్రసాద్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ.400 కోట్లతో విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్‌ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. బడుగు, బలహీనవర్గాల వారు అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచే అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ అందరివాడైన అంబేద్కర్‌ స్మృతివనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, స్కై లైటింగ్‌, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతిఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పొలిమేర హరికృష్ణ, మొండెం సంతోష్‌ కుమార్‌, మేతర అజరు బాబు, మత్తే బాబి, జుజ్జువరపు రవి ప్రకాష్‌, గొల్ల కిరణ్‌ సంఘ మధు, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.

➡️