ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత

ఎంఎల్‌ఎ మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
రూ.21 కోట్లతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రారంభం
ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌
ప్రజారోగ్య పరి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్థానికంగా రూ.21 కోట్లతో ఆధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం అందుకు తార్కాణమని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. గురువారం నూజివీడులో రూ.21.15 కోట్ల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా మోకాళ్లకు ఆపరేషన్‌ చేసే ప్రక్రియను ప్రారంభించారని, నెలకు సుమారు 30 ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసూతి కాన్పులు, ఆపరేషన్లు నెలకు 250 ఈ ఆసుపత్రి ద్వారా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఈ ఆసుపత్రిలో 23 మంది యువ డాక్టర్లతో రోగులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ వైద్య సేవలకు నూజివీడు ఏరియా ఆసుపత్రికి నాక్‌ ధ్రువీకరణతోపాటు మూడుసార్లు కాయాకల్ప అవార్డులను పొందిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఆర్ధోపెడిక్స్‌, ఇఎన్‌టి, డెంటల్‌, ఫిజియోథెరఫీ, ప్రసూతి, జనరల్‌ మెడిసన్‌, జనరల్‌ సర్జరీ, చంటి పిల్లల వైద్యం తదితర వైద్య సేవలు రోగులు పొందుతున్నారని తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో 20 బెడ్స్‌ కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్‌ కింద సేవలందించడానికి ఏర్పాట్లు ఉన్నాయని, దీనికి అపోలో, లయన్స్‌ క్లబ్‌ ద్వారా డయాలసిస్‌కు సంబంధించిన మిషనరీలు సమకూర్చారన్నారు. పాత ఆసుపత్రిలో మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా కొత్త ఆసుపత్రిలో ఆరు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో నూజివీడు ఏరియా ఆసుపత్రిని వంద పడకల నుండి 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ నూతన ఏరియా ఆసుపత్రిలో గుండెపోటుకు సంబంధించిన స్టీమి కూడా ఏర్పాటు చేశామని, రూ.40 వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ ఉచితంగా గుండెపోటు వచ్చిన వారికి ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలుగుతామని తెలిపారు. ఏలూరు జిల్లా ఏరియా ఆసుపత్రి తర్వాత రెండో స్థానంలో నూజివీడు ఆసుపత్రి ఉందన్నారు. త్వరలో నూజివీడు క్రీడా స్టేడియం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే రూ.25 కోట్లతో రింగ్‌రోడ్డు ఏర్పాటు, రూ.6 కోట్లతో పీజీ సెంటర్‌ భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ఐసియు వార్డును కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ప్రారంభించగా జనరల్‌ వార్డులను ఆర్‌డిఒ వై.భవానీశంకరి ప్రారంభించారు. వివిధ యూనిట్లను ప్రజాప్రతినిధులచే ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి సభ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, కారుమూరి సునీల్‌కుమార్‌, ఎపి కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్‌ ఛైర్మన్‌ పగడాల సత్యనారాయణ, డిసిహెచ్‌ఎస్‌ బి.పాల్‌సతీష్‌కుమార్‌, డాక్టర్‌ నాగేశ్వరరావు, 26, 27వ వార్డు కౌన్సిలర్లు మల్లిశెట్టి ప్రియదర్శిని, గాజుల సీతకుమారి, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️