మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలి

భీమడోలు బస్టాండ్‌లో ప్రయాణికులు వేడుకోలు

ప్రజాశక్తి – భీమడోలు

భీమడోలు బస్టాండ్‌లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని, దీనికోసం పాడైపోయిన బోరుకు రిపేరు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాలో ముఖ్యమైన బస్టాండ్‌లలో భీమడోలు ఒక్కటి. దూర ప్రాంతాల నుంచి, జిల్లా పరిసర ప్రాంతాల నుంచి ద్వారకాతిరుమల దేవస్థానానికి పెద్ద ఎత్తున యాత్రికులు వస్తుంటారు. వీరు ద్వారకాతిరుమల వెళ్లేందుకు భీమడోలు బస్టాండ్‌కు తప్పనిసరిగా రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే కాకుండా హైదరాబాద్‌, విజయవాడ నుంచి రాజమండ్రి, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సాధారణంగా తెల్లవారుజాము ప్రాంతంలో భీమడోలు చేరుకుంటారు. విజయవాడ-రాజమండ్రి మధ్య ప్రయాణం చేసే బస్సు ప్రయాణికులు ఇతర ప్రాంతాలలో మరుగుదొడ్లు లేనందువల్ల, భీమడోలు బస్టాండ్‌ వద్ద గల మరుగుదొడ్ల సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. ఈ బస్టాండ్‌లోకి బస్సుల రాకపోకలను తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన ఆర్‌టిసి వారు చేపడతారు. బస్టాండ్‌ నిర్వహణను ద్వారకాతిరుమల దేవస్థానం దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల కాలంగా బస్టాండ్‌లోని బోరు పాడైంది. దీంతో నిర్వాహకులు మరుగుదొడ్ల నిర్వహణకు నీటి సౌకర్యం లేని కారణంగా మరుగుదొడ్లకు తాళాలు వేశారు. వాటర్‌ లేదు అని బోర్డు పెట్టారు. ఈ విషయం తెలియని పలువురు దూర ప్రాంత ప్రయాణికులు తమ మరుగుదొడ్ల అవసరాలు తీర్చుకునేందుకు భీమడోలు బస్టాండ్‌కు వచ్చి, అక్కడ సౌకర్యాలు లేని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ సమస్య గురించి యాజమాన్యానికి తెలియజేసినట్లు తెలిపారు. దీనిపై భీమడోలు బస్టాండ్‌కు చెందిన బాధ్యులను వివరణ కోరగా బోరు పాడైన కారణంగా మరుగుదొడ్లకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకు వెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

➡️